భారత్ లో వ్యాధుల సునామీ.. హెచ్చరిస్తున్న అమెరికా డాక్టర్

  • కేన్సర్ తదితర వ్యాధులను గుర్తించేందుకు అత్యాధునిక విధానాలు అవసరమని సూచన
  • నివారణ, చికిత్స కోసం టీకాలు తీసుకురావాలన్న జేమ్స్ అబ్రహమ్
  • ముందుగా గుర్తించడం కీలకం అంటున్న ప్రముఖ వైద్యుడు
భారత్ దేశం కేన్సర్ తదితర జీవనశైలి వ్యాధుల సునామీని ఎదుర్కోనుందంటూ అమెరికాకు చెందిన ప్రముఖ వైద్యుడు, కేన్సర్ నిపుణుడు డాక్టర్ జేమ్ అబ్రహమ్ హెచ్చరిస్తున్నారు. పెరుగుతున్న వృద్ధ జనాభా, మారుతున్న జీవనశైలి, ఆర్థికాభివృద్ధి ఇవన్నీ కలసి వ్యాధుల ముప్పును పెంచనున్నట్టు అబ్రహమ్ విశ్లేషించారు. 

వ్యాధుల విపత్తును ముందుగా నివారించేందుకు టెక్నాలజీతో కూడిన అత్యాధునిక వైద్య విధానాలను, ఆవిష్కరణలు చేపట్టాలని ఆయన సూచించారు. కేన్సర్ రాకుండా, వచ్చిన తర్వాత తగ్గించే టీకాలను ఆవిష్కరించాలన్నది ఆయన ప్రధాన సూచనగా ఉంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డేటా డిజిటల్ టెక్నాలజీలను ఉపయోగించుకోవాలని సూచించారు. అమెరికాలోని ఓహియోలో క్లెవలాండ్ క్లినిక్ డిపార్ట్ మెంట్ ఆఫ్ హెమటాలజీ, మెడికల్ అంకాలజీ చైర్మన్ గా జేమ్ అబ్రహమ్ పనిచేస్తున్నారు. ఆయన సూచనలు మనోరమ 2023 సంవత్సరం మేగజైన్ లో ప్రచురితమయ్యాయి. 

కేన్సర్ సంరక్షణలో కొత్త టెక్నాలజీలు విప్లవాత్మక మార్పులను తీసుకొస్తున్న క్రమంలో.. భారత్ లో లక్షలాది మంది ప్రజలకు ఈ ఆధునిక వైద్య విధానాలను అందుబాటులో ఉంచడమన్నది పెద్ద సవాలుగా పేర్కొన్నారు. 2020లో ప్రపంచవ్యాప్తంగా 1.93 కోట్ల మంది కేన్సర్ బారిన పడగా, కోటి మంది మరణించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. 2040 నాటికి 2.84 కోట్ల కొత్త కేన్సర్ కేసులు ఏటా వెలుగు చూస్తాయని అంచనా. కేన్సర్ మరణాల్లో 18 శాతం మేర లంగ్ కేన్సర్ వల్లే ఉంటున్నాయి. కొలరెక్టల్ కేన్సర్ తో 9.4 శాతం, కాలేయ కేన్సర్ తో 8.3 శాతం, బ్రెస్ట్ కేన్సర్ తో 6.9 శాతం చొప్పున ప్రాణాలు కోల్పోతున్నారు. 

కేన్సర్ ను ఎదుర్కొనేందుకు టీకాలు నమ్మకమైన ఆప్షన్ గా జేమ్ అబ్రహమ్ పేర్కొన్నారు. కేన్సర్ చికిత్సలో ఎంఆర్ఎన్ఏ టీకాలతో పరీక్షించి పదేళ్లు దాటినట్టు, ప్రాథమిక పరీక్షల్లో మంచి ఫలితాలు కనిపించినట్టు వివరించారు. వీటిని మరింత అభివృద్ధి చేయాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బయాప్సీకి సంబంధించి సాధారణ, అసాధారణ వ్యత్యాసాలను సులభంగా గుర్తించే అత్యాధునిక టెక్నాలజీలు అవసరమన్నారు. ఈ టెక్నాలజీల సాయంతో రేడియోలజిస్టులు, పాథాలజిస్టులు మరింత కచ్చితంగా కేన్సర్ ను గుర్తించే వీలుంటుందన్నారు.

జెనెటిక్ ప్రొఫైలింగ్ ద్వారా బ్రెస్ట్, కొలన్ కేన్సర్లను ముందే గుర్తించొచ్చని జేమ్ అబ్రహమ్ అంటున్నారు. ‘‘ఇప్పుడు స్కాన్ లు, మమ్మోగ్రామ్, కొలనోస్కోపీ, పాప్ స్మియర్ పరీక్షలు కేన్సర్ నిర్ధారణలో ఉపయోగిస్తున్నారు. ఈ పరీక్షలు ట్యూమర్ ను గుర్తించే నాటికే ఆలస్యం అవుతోంది. దీంతో మరింత ప్రభావవంతమైన చికిత్స అవసరం పడుతోంది. లిక్విడ్ బయాప్సీ టెక్నాలజీల సాయంతో చుక్క రక్తంతో కేన్సర్ ను గుర్తించే విధానాలు ఉండాలన్నారు. అప్పుడే ఆరంభ దశలో కేన్సర్ ను గుర్తించడం వల్ల చికిత్స సులభతరం అవుతుందని, నివారించడం సాధ్యపడుతుందని అంచనా. 

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇమ్యూనోథెరపీ, దీనికితోడు కీమో థెరపీలను కేన్సర్ చికిత్సలో ఉపయోగిస్తున్నారు. వీటితో కేన్సర్ ట్యూమర్లు పూర్తిగా నయం అవుతున్నాయి. ప్రస్తుతం ఇదో ప్రామాణిక చికిత్సగా ఉంది. అలాగే కేన్సర్ రోగి రక్తం నుంచి కార్ టీ సెల్ కణాలను వేరు చేసి లేబరేటరీలో మోడిఫై చేసి తిరిగి కేన్సర్ రోగిలోకి ప్రవేశపెడుతున్నారు. కేన్సర్ కణాలపై దాడి చేసే విధంగా కార్ టీ సెల్ కణాలను సిద్ధం చేస్తున్నారు. నివారణ ఒక్కటే మెరుగైన విధానమన్నది జేమ్ అబ్రహమ్ సూచన.


More Telugu News