ప్రపంచానికే సుప్రీం లీడర్ మోదీ.. బీజేపీ జాతీయ కార్యవర్గం ప్రశంసలు

  • ప్రపంచ భవిష్యత్తుకు రక్షకుడిగా భారతదేశం అవతరించిందన్న బీజేపీ కార్యవర్గం 
  • మన దేశ శక్తిని ప్రపంచ దేశాలు గుర్తిస్తున్నాయని వ్యాఖ్య  
  • ప్రతిపక్షాల ఆరోపణలను నీలకంఠుడిలా మోదీ భరించారని కితాబు 
ప్రధాని నరేంద్ర మోదీపై బీజేపీ జాతీయ కార్యవర్గం ప్రశంసల వర్షం కురిపించింది. దేశానికే కాదు మొత్తం ప్రపంచానికే ఆయన సుప్రీం నేత అని, అత్యంత ప్రజాదరణ కలిగిన నేత అని చెప్పుకొచ్చింది. ప్రపంచ భవిష్యత్తుకు రక్షకుడిగా.. మోదీ నాయకత్వంలోని భారతదేశం అవతరించిందని పేర్కొంటూ రాజకీయ తీర్మానాన్ని పాస్ చేసింది. జీ20, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్ సీవో) వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల సదస్సులకు మోదీ నాయకత్వంలోని భారతదేశం అధ్యక్షత వహిస్తోందని, దేశ చరిత్రలో కొత్త అధ్యాయాలు లిఖిస్తోందని కొనియాడింది.

మన దేశ బలం, సామర్థ్యాల గురించి మొత్తం ప్రపంచం తెలుసుకుందని, కరోనా సంక్షోభం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి సందర్భాల్లో ఇండియా సామర్థ్యం ఏంటో బయటపడిందని పేర్కొంది. పర్యావరణం, ప్రకృతి, మానవత్వాన్ని కాపాడే విషయంలో ప్రపంచానికి భారతదేశం నాయకత్వం వహిస్తుందని చెప్పుకొచ్చింది.

‘‘దేశానికే కాదు ప్రపంచానికే సుప్రీం, అత్యంత ప్రజాదరణ కలిగిన నేత ప్రధాని మోదీని బీజేపీ జాతీయ కార్యవర్గం అభినందిస్తోంది’’ అని తీర్మానంలో బీజేపీ పేర్కొంది. సోమ, మంగళవారాల్లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఆమోదించిన రాజకీయ తీర్మానాన్ని బుధవారం విడుదల చేసింది. ఒకే ఏడాదిలో జీ20, ఎస్ సీవో, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల సదస్సులకు అధ్యక్షత వహించడం.. మన దేశ శక్తిని ప్రపంచ దేశాలు గుర్తిస్తున్నాయని చెప్పేందుకు నిదర్శనమని వివరించింది.

‘‘నిరాధార ఆరోపణలు ఎక్కువ కాలం నిలబడవు.. గుజరాత్ అల్లర్ల కేసులో 20 ఏళ్లపాటు మోదీని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రతిపక్షం ప్రయత్నించింది. కానీ ఈ అవమానాలను ప్రధాని మోదీ.. ‘నీలకంఠుడి’లా భరించారు. దేశ అభివృద్ధి కోసం పాటుపడ్డారు. అల్లర్ల కేసులో మోదీకి సుప్రీంకోర్టు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చి ప్రతిపక్షాల తప్పుడు ప్రచారానికి ముగింపు పలికింది’’ అని బీజేపీ పేర్కొంది.


More Telugu News