'ATM' డైరెక్టర్ నాకంటే బాగా తీశాడు: హరీశ్ శంకర్

  • జీ 5 కొత్త వెబ్ సిరీస్ గా 'ATM'
  • నిర్మాతగా దిల్ రాజు తొలి ప్రయత్నం 
  • కథను అందించిన హరీశ్ శంకర్ 
  • ఈ నెల 20వ తేదీ నుంచి స్ట్రీమింగ్
హరీశ్ శంకర్ కి కథాకథనాలపై మంచి పట్టు ఉంది. ఆయన సినిమాలకి ఆయనే కథ .. స్క్రీన్ ప్లే .. సంభాషణలు సమకూర్చుకుంటూ ఉంటాడు. అలాగే మాస్ యాక్షన్ తో పాటు కామెడీ టచ్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. అలాంటి హరీశ్ శంకర్ మొదటిసారిగా ఒక వెబ్ సిరీస్ కి కథను అందించాడు .. ఆ వెబ్ సిరీస్ పేరే 'ATM'. ఈ నెల 20వ తేదీ నుంచి ఈ వెబ్ సిరీస్ జీ 5లో స్ట్రీమింగ్ కానుంది. 

ఈ నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ ప్రీ లాంచ్ ఈవెంట్ నిన్న హైదరాబాదులో జరిగింది. ఈ స్టేజ్ పై హరీశ్ శంకర్ మాట్లాడుతూ .. రెండున్నర గంటల కంటెంట్ ను రెడీ చేయడానికి తనకి 100 రోజులకు పైగా పడుతుందనీ, అలాంటిది నాలుగు గంటల కంటెంట్ ను దర్శకుడు చంద్రమోహన్ 50 రోజుల్లో రెడీ చేయడం ఆశ్చర్యంగా ఉందని అన్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే తనకంటే ఆయన చాలా బాగా తీశాడని చెప్పాడు. ఈ వెబ్ సిరీస్ ను దిల్ రాజు నిర్మించారనీ, తాము ఓటీటీ వైపు రావడాన్ని గురించి కొంతమంది ట్రోల్ చేశారని అన్నాడు. తాను అలాటివి పట్టించుకునే రకం కాదని చెప్పుకొచ్చాడు. ఇక దిల్ రాజు మాట్లాడుతూ .. ఈ కథ విన్నప్పుడే ఇది ఒక మంచి ప్రయత్నం అవుతుందనే నమ్మకం కలిగిందనీ, అందువల్లనే వెంటనే తాను అంగీకరించానని అన్నారు. డిస్ట్రిబ్యూటర్ గా నిర్మాతగా సుదీర్ఘ కాలం అనుభవం ఉన్న తాను, వెబ్ సిరీస్ ను నిర్మించడం ఇదే ఫస్టు టైమ్ అనీ .. అందుకు కారకుడు కూడా హరీశ్ శంకర్ అనీ .. ఈ కథలో అతని మార్క్ కనిపిస్తుందని చెప్పారు. ఇది ఒక కొత్త అనుభవమనీ .. ఈ ప్రయత్నంలో సక్సెస్ అవుతామనే నమ్మకం ఉందని అన్నారు. ఈ ప్రొడక్షన్ లో కొత్త వాళ్లను ఎంకరేజ్ చేస్తామని చెప్పుకొచ్చారు.     



More Telugu News