దుర్వ్యసనాలకు బానిసై.. దొంగతనం చేసి పట్టుబడిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు!

  • సంగారెడ్డిలో సహచర ఉపాధ్యాయినికి అసభ్యకర సందేశాలు పంపడంతో సస్పెన్షన్
  • మళ్లీ విధుల్లో చేరినా మారని వక్రబుద్ధి
  • బైకు నంబరు ప్లేటును రివర్సులో బిగించుకుని తప్పించుకు తిరుగుతున్న వైనం
  • ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన నిందితుడు
చెడు వ్యసనాలకు బానిసై వక్రమార్గం పట్టిన ఓ ఉపాధ్యాయుడు రూ. 1.50 లక్షలు చోరీ చేసి కటకటాలపాలయ్యాడు. సంగారెడ్డిలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన విద్యుత్ శాఖ ఉద్యోగి రాములు ఈ నెల 10న ఓ బ్యాంకులో రూ. 1.50 లక్షలు డ్రా చేసి భార్యతో కలిసి బైక్‌పై ఇంటికి బయలుదేరారు. మార్గమధ్యంలో కూరగాయలు కొనుగోలు చేసేందుకు ఆగారు. రాములు డబ్బులు డ్రా చేయడం చూసిన ఓ వ్యక్తి వారిని బ్యాంకు నుంచి అనుసరిస్తూ వచ్చాడు. కూరగాయల కోసం వారు ఆగగానే రాములు వద్దనున్న డబ్బు సంచి తీసుకుని పరారయ్యాడు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ నెల 17న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని జోగిపేటలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సార సంతోష్‌గా గుర్తించారు. బైక్ నంబరు ప్లేటును రివర్సులో బిగించుకుని తప్పించుకు తిరుగుతున్న అతడిని సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా పట్టుకున్నారు. కాగా, నాలుగు నెలల క్రితం సహచర ఉపాధ్యాయినికి అసభ్యకర సందేశాలు పంపిన ఆరోపణలపై సంతోష్ సస్పెండయ్యాడు. ఇటీవలే విధుల్లో చేరినా చోరీ చేసి దొరికిపోయాడు. నిందితుడి నుంచి చోరీ చేసిన సొమ్మును స్వాధీనం చేసుకున్న పోలీసులు రిమాండ్‌కు పంపారు.


More Telugu News