గుండెపోటుతో కుర్చీలోనే కుప్పకూలిన వ్యక్తి... సీపీఆర్ చేసి కాపాడిన ఐఏఎస్ అధికారి.. వీడియో ఇదిగో!

  • చండీగఢ్‌లోని హౌసింగ్ బోర్డు కార్యాలయంలో ఘటన
  • సకాలంలో స్పందించి సీపీఆర్ చేసిన ఐఏఎస్ అధికారి యశ్‌పాల్ గార్గ్
  • వీడియోను షేర్ చేసిన ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలీవల్
ఏదో పనిపై ప్రభుత్వ కార్యాలయానికి వచ్చి గుండెపోటుతో కుర్చీలోనే కుప్పకూలిన వ్యక్తిని ఓ ఐఏఎస్ అధికారి కాపాడారు. క్షణాల్లోనే స్పందించి సీపీఆర్ చేయడంతో ఆయన మళ్లీ ఊపరి పీల్చుకున్నారు. చండీగఢ్‌లో జరిగిందీ ఘటన. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చండీగఢ్‌లోని సెక్టార్ 41కి చెందిన జనక్‌లాల్ ఏదో పనిపై మంగళవారం ఉదయం చండీగఢ్ హౌసింగ్ బోర్డు కార్యాలయానికి వచ్చారు. అక్కడ కుర్చీలో కూర్చుని అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. సమాచారం తెలిసిన వెంటనే ఆరోగ్యశాఖ కార్యదర్శి యశ్‌పాల్ గార్గ్ తన సీటులోంచి లేచి పరుగున అక్కడికి వెళ్లి ఆ వ్యక్తికి సీపీఆర్ చేశారు. దీంతో ఆయన కోలుకున్నారు. ఆపై నీళ్లు అడిగి తాగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలీవల్ ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. యశ్‌పాల్ గార్గ్ సీపీఆర్ చేసి ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడారని, ప్రతి ఒక్కరు సీపీఆర్ నేర్చుకోవాలని కోరారు. కాగా, సీపీఆర్ చేసిన తర్వాత జనక్‌లాల్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన అక్కడ వైద్యుల పరిశీలనలో ఉన్నారు.


More Telugu News