పంజాబ్‌లో కాంగ్రెస్‌కు షాక్.. పార్టీకి గుడ్ బై చెప్పి గంటల్లోనే బీజేపీలో చేరిన సీనియర్ నేత

  • పార్టీని వీడిన మాజీ ఆర్థిక మంత్రి మన్‌ప్రీత్ సింగ్ బాదల్
  • కేంద్రమంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో బీజేపీలో చేరిక
  • రాహుల్ గాంధీకి రాజీనామా లేఖ
  • బాదల్ చేరికతో సిక్కులతో తమ బంధం బలపడుతుందన్న కేంద్రమంత్రి
పంజాబ్‌లో కాంగ్రెస్‌కు షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి మన్‌ప్రీత్ సింగ్ బాదల్ పార్టీని వీడారు. ఆపై కొన్ని గంటల వ్యవధిలోనే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో బీజేపీలో చేరారు. మన్‌ప్రీత్ అంతకుముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి రాసిన రాజీనామా లేఖలో.. పార్టీలో కానీ, ప్రభుత్వంలో కానీ తనకు అప్పగించిన ప్రతి బాధ్యతను నెరవేర్చేందుకు కృషి చేసినట్టు చెప్పారు. తనకు అవకాశాలు కల్పించడంతోపాటు తనపై చూపించిన గౌరవానికి కృతజ్ఞతలు తెలిపారు.

ప్రస్తుతం పార్టీలో ఘర్షణ వాతావరణం నిండి ఉందని, అలాగే పంజాబ్ సహా అనేక రాష్ట్రాల్లో పార్టీ వర్గాలతో నిండిపోయిందని విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో తాను పనిచేయలేనని స్పష్టం చేశారు. అలాగే, ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ప్రశంసలు కురిపించారు. ఈ తొమ్మిదేళ్ల కాలంలో దేశం ఎంతో బలంగా తయారైందన్న మన్‌ప్రీత్ సింగ్.. పంజాబ్‌లోని సవాళ్లను బీజేపీ మాత్రమే ఎదుర్కోగలదన్నారు. పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. బాదల్ బీజేపీలో చేరిన ఈ రోజు తమకు సువర్ణాక్షరాలతో లిఖించదగినదని.. ఆయన చేరికతో సిక్కులతో తమ బంధం మరింత బలపడుతుందని అన్నారు.


More Telugu News