24 గంటల వ్యవధిలో శ్రీహరికోటలో మూడో ఆత్మహత్య!

  • భర్త మృతదేహం తీసుకెళ్లేందుకు వచ్చి అతిథి గృహంలో ఉరేసుకున్న భార్య
  • ఇటీవల సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని చనిపోయిన సీఐ వికాస్ సింగ్ 
  • గంటల వ్యవధిలోనే అడవిలో చెట్టుకు ఉరేసుకున్న కానిస్టేబుల్
శ్రీహరికోటలోని అంతరిక్ష పరిశోధన కేంద్రం(షార్) లో మూడో ఆత్మహత్య చోటుచేసుకుంది. భర్త ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసి అక్కడికి వచ్చిన భార్య ఉరేసుకుంది. ఈ కేంద్రంలో భద్రతా విధుల్లో ఉన్న సీఐఎస్ఎఫ్ సీఐ వికాస్ సింగ్ ఈ నెల 17న సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని చనిపోయాడు. అదేరోజు షార్ లో భద్రతా విధుల్లో ఉన్న కానిస్టేబుల్ చింతామణి ఓ చెట్టుకు ఉరేసుకుని చనిపోయాడు. 24 గంటల వ్యవధిలో మూడు ఆత్మహత్యలు జరగడంతో ఉద్యోగులలో ఆందోళన నెలకొంది.

2015 బ్యాచ్‌కు చెందిన వికాస్.. ముంబైలోని బాబా అటామిక్ సెంటర్ లో విధుల్లో చేరారు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా కిందటేడాది నవంబర్ లో వికాస్ సింగ్ శ్రీహరికోటకు బదిలీ అయ్యారు. కాగా, కొన్ని రోజులు సెలవు కావాలని వికాస్ సింగ్ అడుగుతుండగా ఉన్నతాధికారులు తిరస్కరిస్తూ వస్తున్నారని ఆయన సహచరులు చెప్పారు. సెలవు దొరకకపోవడం వల్లే వికాస్ ఈ కఠిన నిర్ణయం తీసుకుని ఉంటాడని చెప్పారు. ఆపై కొన్ని గంటల వ్యవధిలోనే కానిస్టేబుల్ చింతామణి జీరోపాయింట్ రాడార్ సెంటర్ దగ్గర్లోని అడవిలో ఓ చెట్టుకు ఉరేసుకుని చనిపోయాడు. ఛత్తీస్ గఢ్ కు చెందిన చింతామణి ఈ నెల 10న శ్రీహరికోట అంతరిక్ష కేంద్రంలో కానిస్టేబుల్ గా విధుల్లో చేరాడు.

వికాస్ సింగ్ ఆత్మహత్య విషయం తెలిసి ఉత్తరప్రదేశ్ లో ఉంటున్న ఆయన భార్య ప్రియాసింగ్ మంగళవారం సాయంత్రం శ్రీహరికోటకు చేరుకున్నారు. తన పిల్లలతో పాటు అన్నను వెంటబెట్టుకుని వచ్చారు. భర్త మృతదేహాన్ని చూసి కన్నీటిపర్యంతమయ్యారు. అధికార కార్యక్రమాలు పూర్తిచేసి, మృతదేహం అప్పగించేందుకు సమయం పడుతుందని చెప్పడంతో షార్ లోని నర్మద అతిథి భవన్ లో బస చేశారు. తెల్లవారుజామున ప్రియాసింగ్ ఫ్యాన్ కు ఉరేసుకున్నారు. భర్త మరణాన్ని తట్టుకోలేకే ప్రియాంక బలవన్మరణానికి పాల్పడి ఉంటుందని అధికారులు చెప్పారు.


More Telugu News