యాదాద్రిలో ముగ్గురు ముఖ్యమంత్రులు.. తెలంగాణ సీఎం కేసీఆర్ తో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు

  • లక్ష్మీనరసింహుడిని దర్శించుకున్న సీఎంలు
  • కేసీఆర్ తో కలిసి ఆలయానికి పినరయి, కేజ్రీవాల్, మాన్
  • పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు
భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సభలో పాల్గొనేందుకు వచ్చిన ముగ్గురు ముఖ్యమంత్రులు యాదాద్రి ఆలయాన్ని సందర్శించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కేరళ సీఎం పినరయి విజయన్ బుధవారం యాదాద్రి ఆలయానికి చేరుకున్నారు. సీఎంల టూర్ కారణంగా స్వామివారి దర్శనానికి భక్తులను బుధవారం అనుమతించలేదు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు దర్శనానికి భక్తులను అనుమతించలేదు.

ప్రత్యేక హెలికాప్టర్లలో యాదాద్రి చేరుకున్న సీఎంలు కేసీఆర్, పినరయి, కేజ్రీవాల్, మాన్ లకు ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం కేసీఆర్, కేజ్రీవాల్, మాన్ లు స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. తర్వాత వేదమంత్రాలతో ముఖ్యమంత్రులను అర్చకులు ఆశీర్వదించారు. స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలను వారికి అందజేశారు. యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, ఎంపీ సంతోష్ కుమార్, రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత తదితరులు కూడా స్వామివారిని దర్శించుకున్నారు.


More Telugu News