ఏపీ విద్యాశాఖ అధికారులకు జైలు శిక్ష.. అధికారుల క్షమాపణతో తీర్పు సవరించిన హైకోర్టు

  • సర్వీసు అంశాలపై తీర్పును అమలుచేయలేదని శిక్ష
  • నెల రోజుల జైలు శిక్షతో పాటు రూ.వెయ్యి జరిమానా
  • అధికారుల క్షమాపణతో శిక్షను తగ్గించి సాయంత్రం వరకు కోర్టులో నిలబడాలని ఆదేశించిన న్యాయమూర్తి
  • విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్, రామకృష్ణల అరెస్టుకు కోర్టు ఆదేశం
సర్వీసు అంశాలపై గతంలో ఇచ్చిన తీర్పును అమలుచేయలేదని దాఖలైన కోర్టు ధిక్కరణ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఇద్దరు ఉన్నతాధికారులకు జైలు శిక్ష విధించడం సంచలనంగా మారింది. తీర్పు నేపథ్యంలో హుటాహుటిన హైకోర్టుకు చేరుకున్న అధికారులు ఇద్దరూ కోర్టుకు క్షమాపణ చెప్పారు. దీంతో హైకోర్టు తీర్పును సవరించింది. సాయంత్రం వరకు కోర్టులో నిలబడాలని ఆదేశించింది.

కోర్టు ధిక్కార పిటిషన్ పై తీర్పు వెలువరిస్తూ.. ఐఏఎస్ అధికారి, ప్రస్తుతం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న బుడితి రాజశేఖర్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీగా బాధ్యతలు నిర్వహిస్తున్న రామకృష్ణలకు కోర్టు నెల రోజుల జైలు శిక్ష విధించింది. దీంతో పాటు రూ. వెయ్యి చొప్పున జరిమానా కట్టాలని ఆదేశించింది.

ఉన్నతాధికారులు ఇద్దరినీ అదుపులోకి తీసుకోవాలంటూ పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీచేసింది. కాగా, ఐఏఎస్ అధికారి బుడితి రాజశేఖర్ గతంలో ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేశారు. రామకృష్ణ గతంలో ఇంటర్ బోర్డు కమిషనర్ గా పనిచేశారు. ఆ సమయంలో ఉద్యోగుల సర్వీసు నిబంధనలకు సంబంధించి కోర్టు తీర్పును అమలు చేయలేదని వారు అభియోగాలు ఎదుర్కొన్నారు. దీనిపై కోర్టు ధిక్కరణ కేసు నమోదైంది. తాజాగా ఈ కేసులో హైకోర్టు తీర్పు వెలువరించింది.


More Telugu News