‘బేషరమ్ రంగ్’ పాటకు సెన్సార్ కట్స్.. క్లోజప్ షాట్స్ తొలగింపు

  • ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు ‘పఠాన్’
  • సెన్సార్ బోర్డు ముందు చిత్ర ప్రదర్శన
  • 10కి పైగా కట్స్ సూచించిన సెన్సార్ బోర్డు
  • ‘బేషరమ్ రంగ్’ పాటలోని మూడు క్లోజప్ షాట్స్ కట్
బాలీవుడ్ అగ్ర కథానాయకుడు షారుఖ్ ఖాన్-దీపిక పదుకొణే జంటగా నటించిన చిత్రం ‘పఠాన్’. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 25న థియేటర్లకు రాబోతోంది. ఈ సినిమాలోని ‘బేషరమ్ రంగ్’ పాట దేశవ్యాప్తంగా తీవ్ర వివాదాస్పదమైంది. దీపిక కాషాయరంగు స్విమ్ సూట్ ధరించడంతోపాటు అందులోని సీన్లు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ నిరసనలు వెల్లువెత్తాయి. రాజకీయంగానూ ఈ సినిమాకు నిరసన సెగలు తగిలాయి. సినిమాను విడుదల కానివ్వబోమంటూ పలువురు నాయకులు హెచ్చరించారు. పనిలో పనిగా సెన్సార్ బోర్డుపైనా విరుచుకుపడ్డారు. 

తాజాగా, ఈ సినిమాను చిత్ర బృందం సెన్సార్ బోర్డు ముందు ప్రదర్శించింది. వీక్షించిన బోర్డు ‘పఠాన్’కు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. అలాగే, పలు కట్స్ సూచించింది. ‘బేషరమ్ రంగ్’ పాటలో దీపిక స్విమ్ సూట్‌లో ఉన్న మూడు క్లోజప్ షాట్స్‌తోపాటు కొన్ని డ్యాన్స్ మూమెంట్స్‌ను తొలగించాలని ఆదేశించింది. సినిమాకు మొత్తంగా 10కిపైగా కట్స్ సూచించింది. దీంతో సినిమా విడుదల సమయానికి మార్పులు చేయనున్నట్టు చిత్ర బృందం తెలిపింది. కాగా, యాక్షన్ థ్రిల్లర్ అయిన ఈ సినిమా రన్‌టైమ్ 2.26.16 గంటలు. సినిమాలో కొన్ని యాక్షన్ సీన్లను సైబీరియలో గడ్డకట్టిన బైకల్ సరస్సులో చిత్రీకరించారు. అక్కడ చిత్రీకరణ జరుపుకున్న తొలి బాలీవుడ్ చిత్రంగా ‘పఠాన్’ రికార్డులకెక్కింది.


More Telugu News