ఎక్చేంజ్ లో మీ ఫోన్ ఎక్కువ ధర పలకాలంటే.. ఇలా చేసిచూడండి!

  • స్మార్ట్ ఫోన్ ఎక్చేంజ్ కు నిపుణులు సూచిస్తున్న టిప్స్ 
  • మొబైల్ పై గీతలు పడకుండా జాగ్రత్తగా వాడుకోవాలని సూచన
  • మార్పిడి సమయంలో ఫోన్ ను శుభ్రం చేయాలంటున్న నిపుణులు
  • ప్యానల్ మార్చడం ద్వారా కొంత ఫలితం ఉంటుందని వెల్లడి
మార్కెట్లోకి వచ్చిన కొత్త మోడల్ స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేయాలని అనుకుంటే ఇప్పటికే వాడుతున్న ఫోన్ ను ఎక్చేంజ్ చేయడం సాధారణమే! అయితే, ఈ విధంగా ఎక్చేంజ్ చేస్తున్నపుడు కంపెనీలు పాత మొబైల్ కు అతి తక్కువ మొత్తం చెల్లిస్తాయి. ఫోన్ బాగున్నా సరే తక్కువ మొత్తానికే ఎక్చేంజ్ చేస్తుంటాయి. ఇలాంటపుడు మీ పాత ఫోన్ ను ఎక్కువ ధరకు మార్పిడి చేసుకోవాలంటే ఈ క్రింది జాగ్రత్తలు పాటించండి. మీ స్మార్ట్ ఫోన్ బాగా పనిచేస్తున్నప్పటికీ కంపెనీలు తక్కువగా వెలకట్టడానికి ప్రధాన కారణం.. పాత ఫోన్ లుక్. మీరు వాడుతున్న ఫోన్ సరికొత్తగా కనిపించేలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే కొంచెం ఎక్కువ ధర పొందొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

ఇలా చేయండి..
  • చూసీచూడంగానే పాత ఫోన్ అని గుర్తించేలా ఉన్న ఫోన్ కు ఏ కంపెనీ ఎక్కువ వెలకట్టదు. అందుకే మీ స్మార్ట్ ఫోన్ ను జాగ్రత్తగా క్లీన్ చేయాలి. స్క్రీన్ పై ఎలాంటి గీతలు లేకుండా చూసుకోవాలి.
  • స్మార్ట్ ఫోన్ బ్యాక్ ప్యానెల్ పై గీతలు పడినట్టయితే ప్యానెల్ మార్చేయండి. దీనివల్ల ప్యానెల్ మాత్రమే కాదు మీ ఫోన్ కూడా కొత్తదానిలా కనిపిస్తుంది. ఫలితంగా ఎక్కువ ధర పలుకుతుంది.
  • వాడకంలో ఉన్న ఫోన్ కొన్నాళ్లకు వేగం మందగిస్తుంది. దీనివల్ల కూడా ఎక్చేంజ్ సమయంలో పెద్దగా ధర పలకదు. ఎక్చేంజ్ కు ముందు ఫోన్ సాఫ్ట్ వేర్ అప్ డేట్ చేస్తే ఫోన్ స్పీడ్ పెరుగుతుంది.
  • మీ ఫోన్ వేగంగా పనిచేస్తుండడంతో ఎక్చేంజ్ లో ఎక్కువ మొత్తం పలుకుతుంది. ఆ మేరకు మీ కొత్త ఫోన్ ధరలో తగ్గింపును పొందొచ్చు.
  • కొత్త ఫోన్ కొన్నప్పటి నుంచి జాగ్రత్తగా వాడుకుంటే ఎక్చేంజ్ సమయంలో మంచి ధర పొందొచ్చు. ముఖ్యంగా తరచూ ఫోన్ లు మార్చే అలవాటు ఉన్నవాళ్లు ఈ జాగ్రత్తలు పాటిస్తే తక్కువ ఖర్చుతో ఎప్పటికప్పుడు లేటెస్ట్ మోడల్ ఫోన్ వాడుకోవచ్చు.


More Telugu News