సావిత్రి ఇంట్లో ఉన్న బీరువాల కొద్దీ బంగారాన్ని ఎలా తీసుకెళ్లారంటే..!: కూతురు విజయచాముండేశ్వరి

  • తాజా ఇంటర్వ్యూలో సావిత్రి కూతురు .. అల్లుడు 
  • సావిత్రి బంగారం గురించిన ప్రస్తావన
  • సావిత్రి నడిస్తే బంగారం రాలిపడుతుందేమోనని చూసేవారట 
  • ఆమె బంగారాన్ని పెద్దమూటగట్టి ఇన్ కమ్ టాక్స్ వారు తీసుకెళ్లారని వెల్లడి
'మహానటి' సావిత్రి జీవితంలో ఎన్నో మలుపులు .. మరెన్నో ఆసక్తికరమైన అంశాలు కనిపిస్తూ ఉంటాయి. అలాంటి సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి .. ఆమె భర్త గోవిందరావు (సావిత్రి మేనల్లుడు) ఇద్దరూ కలిసి మొదటిసారిగా సుమన్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. సావిత్రి ఇంట్లో అప్పట్లో బంగారం కేజీల కొద్దీ ఉండేదని ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. ఆ విషయాన్ని వారు ప్రస్తావించారు. 

గోవిందరావు మాట్లాడుతూ .. "సావిత్రిగారికి బంగారం అంటే చాలా ఇష్టం .. బంగారు ఆభరణాలను ఆమె ఎక్కువగా ధరించేవారు. సావిత్రిగారు ఏ ఉత్సవానికైనా వెళితే రెడ్ కార్పెట్ పరిచేవారు. ఆమె నడుస్తూ వెళతుంటే బంగారం ఏమైనా దొరుకుతుందేమోనని ఆ మ్యాట్స్ పై కొంతమంది కుర్రాళ్లు వెతుకుతూ ఉండేవారు. అంతటి వైభవంగా ఆమె కనిపించేవారు" అని అన్నారు. 

విజయ చాముండేశ్వరి మాట్లాడుతూ .. " మొదటి నుంచి కూడా బంగారు ఆభరాణాలు అంటే ఆమెకి చాలా ఇష్టం. జ్యుయలరీ షాపుల ఓపెనింగ్స్ కి అమ్మను పిలిస్తే తప్పకుండా వెళ్లేది. ఆ షాపు వారికి మంచి బిజినెస్ ఇవ్వాలనే ఉద్దేశంతో తెగ కోనేసేది. అమ్మ నగలు బీరువా నిండుగా ఉండేవి .. బాక్సులు బీరువాలో సరిపోయేవి కాదు. అందువలన బంగారు గాజుల్లోకి రిబ్బన్ దూర్చి ముడేసేది. అలా రిబ్బన్లు కట్టిన గాజులు బీరువాలో చాలా ఉండేవని ఆమ్మ స్నేహితులు చెబుతుంటారు" అన్నారు. 

"అందువల్లనే ఇన్ కమ్ టాక్స్ వారు ముందుగా వాటిపైనే పడ్డారు. నాకు బాగా గుర్తు  .. బీరువాల్లోని నగలను బాక్సులలో తీసుకుని వెళ్లడం వాళ్లకి కుదరలేదు. అందువలన పెద్ద బెడ్ షీట్ ను క్రింద పరిచి నగలన్నీ కుప్పగా పోసి పెద్ద మూటగట్టి తీసుకుపోయారు. ఇష్టపడి చేయించుకున్న నగలను అలా తీసుకుని వెళుతుంటే అమ్మ చాలా బాధపడింది. ఇక అమ్మ దగ్గర బంగారు ఆభరణాలు అడిగి తీసుకున్న స్నేహితులు కొంతమంది వాటిని తిరిగి ఇవ్వలేదు. దాంతో ఆమె మరింత అప్సెట్ అయింది" అని చెప్పుకొచ్చారు.


More Telugu News