ఒక్క రోజు ప్రయాణానికి రూ.50 వేలా?.. గంగా విలాస్ క్రూయిజ్ యాత్రపై జైరాం రమేశ్ ట్వీట్

  • సామాన్యులు ఈ ధరను భరించగలరా? అంటూ నిలదీత
  • గంగా నదిలోని జలచరాలు అంతరించిపోతాయని ఆందోళన
  • యాత్రపై ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించిన కాంగ్రెస్ నేత
  • గంగా విలాస్ క్రూయిజ్ చిక్కుకుపోయిందన్న ప్రచారాన్ని కొట్టిపారేసిన కేంద్రం
ఒక్క రోజు ప్రయాణానికి రూ.50 వేలు వెచ్చించే స్తోమత సామాన్యులకు ఉంటుందా.. బాగా ధనవంతులు తప్ప గంగా విలాస్ యాత్ర ఖర్చును ఎవరైనా భరించగలరా.. అంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైరాం రమేశ్ విమర్శలు గుప్పించారు. గంగా విలాస్ యాత్ర కేవలం ధనవంతుల విలాసం కోసమేనని జైరాం రమేశ్ ట్విట్టర్ లో ఆరోపించారు. ఈ క్రూయిజ్ తో గంగా నదిలోని జలచరాలకు ముప్పు వాటిల్లడం, గంగా నది కలుషితం కావడం తప్ప సామాన్యులకు ఒరిగేదేమీలేదని మండిపడ్డారు.

గంగా విలాస్ యాత్ర ప్రారంభోత్సవం దేశ చరిత్రలో ఓ మైలురాయి అంటూ ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ నెల 13న ఈ సుదీర్ఘ యాత్రను వర్చువల్ గా ప్రారంభిస్తూ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ పర్యాటక చరిత్రలో ఓ కొత్త శకానికి ఇది ప్రారంభమని పేర్కొన్నారు. భారతదేశంతో పాటు బంగ్లాదేశ్ లోని నదులపై 51 రోజుల పాటు సాగే ఈ యాత్రలో 50 చారిత్రక ప్రదేశాలను సందర్శించవచ్చని మోదీ చెప్పారు.

బీహార్ లో గంగా విలాస్ నిలిచిపోయిందా..
గంగా విలాస్ క్రూయిజ్ షిప్ బీహార్ లో చిక్కుకుపోయిందంటూ జరుగుతున్న ప్రచారాన్ని ప్రభుత్వం తోసిపుచ్చింది. షెడ్యూల్ ప్రకారమే క్రూయిజ్ ప్రయాణం కొనసాగుతుందని కేంద్రం స్పష్టం చేసింది. సోమవారం పాట్నా చేరుకున్న గంగా విలాస్.. గంగా నదిలో నీరు తగ్గిపోవడంతో ఒడ్డుకు చేరలేక నది మధ్యలోనే నిలిచిపోయిందని సోమవారం ప్రచారం జరిగింది. అయితే, క్రూయిజ్ లోని పర్యాటకులు తీరంలో విహరించేందుకు చిన్న చిన్న పడవలతో ఒడ్డుకు చేరుకున్నారని, క్రూయిజ్ నిలిచిపోలేదని కేంద్ర పర్యాటక శాఖ వివరణ ఇచ్చింది.


More Telugu News