నేపాల్‌లో యతి ఎయిర్‌లైన్స్ విమాన ప్రమాదం.. దాని యజమాని కూడా ఇలాగే మృతి!

  • నేపాల్ విమాన ప్రమాదంలో 72 మంది మృతి
  • హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన అంగ్ టెషెరింగ్ షేర్పా
  • ప్రమాదంలో అప్పటి విమానయానశాఖ మంత్రి కూడా దుర్మరణం
నేపాల్‌లో ఆదివారం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో నలుగురు సిబ్బంది సహా 72 మంది ప్రాణాలు కోల్పోయారు. ఖాట్మండు నుంచి 68 మంది ప్రయాణికులతో బయలుదేరిన యతి ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈ విమానం పోఖరాలో ల్యాండ్ కావడానికి కొన్ని క్షణాల ముందు కుప్పకూలింది. మృతుల్లో ఐదుగురు భారతీయులు కూడా ఉన్నారు. 

యతి ఎయిర్‌లైన్స్ యజమాని అయిన అంగ్ టెష్‌రింగ్ షేర్పా కూడా ఇలాంటి ప్రమాదంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఫిబ్రవరి 2019లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మృతి చెందారు. టెర్తుమ్ జిల్లాలో కొత్తగా విమానాశ్రయాన్ని నిర్మించాలని నేపాల్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు అప్పటి విమానయానశాఖ మంత్రి రవీంద్ర అధికారి, మరికొందరు అధికారులు సహా అంగ్ టెష్‌రింగ్ హెలికాప్టర్‌లో వెళ్లారు.

ఐదు సీట్ల హెలికాప్టర్‌ ఆరుగురితో కలిసి ఆ రోజున ఉదయం 6 గంటలకు బయలుదేరింది. విమానాశ్రయం ఏర్పాటు చేయాలనుకుంటున్న ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం మధ్యాహ్నం తిరిగి వస్తుండగా పతిభరా జిల్లాలోని టప్లేజుంగ్‌లోని ఓ కొండపై మధ్యాహ్నం 1.30 గంట సమయంలో హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో పైలట్ సహా అందరూ ప్రాణాలు కోల్పోయారు. 

ఈ హెలికాప్టర్ ఎయిర్ డైనస్టీ హెలి సర్వీసెస్‌కు చెందినది. నేపాల్‌లోని అత్యంత పురాతన హెలికాప్టర్ రెస్క్యూ కంపెనీ ఇది. ప్రమాదంలో అంగ్ టెష్‌రింగ్‌తోపాటు అప్పటి పౌరవిమానయాన మంత్రి, ఆయన పీఎస్ఓ, సివిల్ ఏవియేషన్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్, మంత్రిత్వశాఖ డైరెక్టర్, డిప్యూటీ సెక్రటరీ మృతి చెందారు. అప్పట్లో ఈ ఘటన సంచలనమైంది.  



More Telugu News