రాజమౌళి ప్రసంగంపై కంగనా రనౌత్ సహా నెటిజన్ల ప్రశంసలు

  • ఆర్ఆర్ఆర్ సినిమాకు బెస్ట్ ఫారీన్ లాంగ్వేజ్ ఫిల్మ్ అవార్డ్
  • అవార్డు కార్యక్రమంలో రాజమౌళి కీలక ప్రసంగం
  • అవార్డును తన జీవితంలోని మహిళలు అందరికీ అంకితం చేస్తున్నట్టు ప్రకటన
ప్రముఖ దర్శకుడు రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ మూవీకి ‘బెస్ట్ ఫారీన్ లాంగ్వేజ్ ఫిల్మ్’ అవార్డ్ ను క్రిటిక్స్ చాయిస్ అవార్డ్స్ ప్రకటించింది. ఈ సందర్భంగా రాజమౌళి చేసిన ప్రసంగం భారతీయతను తలపించడమే కాకుండా, ఎంతో మంది మనసులను గెలుచుకుంది. ఆయన అందరికీ నమస్కారం అంటూ తెలుగులో ప్రసంగం మొదలు పెట్టారు. చివరికి మేరా భారత్ మహాన్ అంటూ ముగించారు.

‘‘ఈ అవార్డును నా జీవితంలోని మహిళలు అందరికీ అంకితం ఇస్తున్నాను. మా అమ్మ రాజనందిని పాఠశాల విద్య కంటే కూడా నన్ను కామిక్స్, స్టోరీ పుస్తకాలు ఎక్కువ చదివేలా ప్రోత్సహించింది. నాలో సృజనాత్మకతను ప్రోత్సహించింది. మా వదిన శ్రీవల్లి (నాకు అమ్మ వంటిది) ఎప్పుడూ కూడా నేను జీవితంలో మెరుగ్గా ఉండాలని కోరుకునేది. నా జీవిత భాగస్వామి రమ, నా సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసినా, నా జీవితానికి ఆమె డిజైనర్. ఆమే లేకపోతే నేను ఈ రోజు ఇక్కడ ఉండే వాడిని కాదు. నా కుమార్తెలు ఏమీ చేయక్కర్లేదు. వారి చిరునవ్వు చాలు నా జీవితాన్ని వెలగించడానికి’’ అని రాజమౌళి ప్రసంగించారు. 

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ రాజమౌళి వీడియోను తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేసి తన స్పందనను తెలియజేసింది. ‘‘అమెరికా సహా చాలా ప్రాంతాల్లో భారతీయులు అధికంగా ఆర్జిస్తూ, విజయవంతమైన కమ్యూనిటీగా వున్నారు. ఏమీ లేని స్థితి నుంచి దీన్ని ఎలా సాధించామా? అని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. కానీ ఇందులో చాలా వరకు మన బలమైన కుటుంబ వ్యవస్థ నుంచే వస్తోంది. మనం ఎంతో భావోద్వేగ పరమైన, ఆర్థిక, మానసిక మద్దతును మన కుటుంబాల నుంచి పొందుతుంటాం. స్త్రీల వల్ల కుటుంబాలు ఏర్పాటు అవుతాయి. కుటుంబాలను వారే పోషిస్తూ, కలసి ఉంచుతారు’’ అని పేర్కొంది.


More Telugu News