భారత్ లోని సంపన్నులపై 2% పన్ను వేస్తే.. మూడేళ్లపాటు దేశంలోని చిన్నారుల ఆకలి తీర్చొచ్చు!
- దేశ జనాభాలోని 1శాతం ధనవంతుల దగ్గరే 40 శాతం సంపద
- ఆక్స్ ఫామ్ వార్షిక నివేదికలో వెల్లడి
- వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో విడుదల
- 2022లో భారత్ లోని బిలియనీర్ల సంఖ్య 166
భారత దేశ సంపదలో దాదాపు సగం సంపద కొద్దిమంది ధనవంతుల దగ్గరే ఉందని ఆక్స్ ఫామ్ నివేదిక సోమవారం వెల్లడించింది. దావోస్ కేంద్రంగా జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం వార్షిక సదస్సులో ఈ నివేదికను విడుదల చేసింది. గడిచిన రెండేళ్లలో భారత్ లోని బిలియనీర్ల సంఖ్య పెరిగిందని పేర్కొంది. 2020లో 102 మంది బిలియనీర్లు ఉండగా.. 2022 ఏడాదిలో వారి సంఖ్య 166 మందికి చేరిందని తెలిపింది. దేశ జనాభాలో సంపన్నులు కేవలం 1 శాతం మాత్రమేనని ఈ నివేదికలో పేర్కొంది. అయితే, ఈ ఒక్క శాతం ధనవంతుల దగ్గరే దేశ సంపదలో 40 శాతం ఉందని వెల్లడించింది. జనాభాలో దాదాపు సగం మంది దగ్గర ఉన్న సంపద కేవలం 3 శాతం మాత్రమేనని తెలిపింది.
ఆక్స్ ఫామ్ నివేదిక వెల్లడించిన మరికొన్ని ఆసక్తికర విశేషాలు..
ఆక్స్ ఫామ్ నివేదిక వెల్లడించిన మరికొన్ని ఆసక్తికర విశేషాలు..
- భారత్ లోని సంపన్నులపై ఒక్కసారి 5 శాతం పన్ను వసూలు చేస్తే వచ్చే మొత్తంతో దేశంలోని పిల్లలందరికీ చదువు చెప్పించవచ్చు
- 2017-2022 మధ్య కాలంలో గౌతమ్ అదానీ సంపాదన రూ.1.79 లక్షల కోట్లు.. ఈ మొత్తంతో దేశంలోని 50 లక్షల మంది ప్రైమరీ స్కూలు టీచర్లకు ఏడాది పాటు జీతాలు చెల్లించవచ్చు
- దేశంలోని సంపన్నుల మొత్తం ఆస్తులపై ఒక్కసారి 2 శాతం పన్నుల రూపంలో వసూలు చేస్తే వచ్చే మొత్తం రూ. 40,423 కోట్లు.. ఈ మొత్తంతో దేశంలో పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లలకు మూడేళ్ల పాటు భోజనం పెట్టొచ్చు
- భారత్ లోని పది మంది బిలియనీర్లపై 5 శాతం పన్ను (ఒక్కసారి) వేస్తే వచ్చే మొత్తం రూ. 1.37 లక్షల కోట్లు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ (రూ.86,200 కోట్లు), ఆయుష్ మంత్రిత్వ శాఖ (రూ.3,050 కోట్లు) ల బడ్జెట్ కన్నా ఒకటిన్నర రెట్లు ఎక్కువ.
- దేశంలోని స్త్రీ, పురుషుల సంపాదనలో తేడా చాలా ఎక్కువగా ఉంది. పురుషుల సంపాదనతో పోలిస్తే స్త్రీల సంపాదన రూపాయిలో కేవలం 63 పైసలు మాత్రమే.
- సమాజంలోని మిగతా వర్గాలు సంపాదించే మొత్తంలో 55 శాతం మాత్రమే రైతులు ఆర్జిస్తున్నారు.
- కరోనా కష్టకాలంలో దేశంలోని సంపన్నుల ఆస్తులు 121 శాతం పెరిగింది. ఈ కాలంలో సంపన్నులు రోజుకు రూ.3,608 కోట్లు సంపాదించారు.
- 2021-22 ఏడాదికి జీఎస్టీ రూపంలో వసూలైన మొత్తం రూ.14.83 కోట్లు కాగా అందులో 64 శాతం దేశంలోని అట్టడుగు వర్గాలే చెల్లించారు. దేశంలోని టాప్ 10 ధనవంతుల నుంచి వసూలైన జీఎస్టీ కేవలం 3 శాతం మాత్రమే!