హిడ్మా బతికే ఉన్నాడు: మావోయిస్టుల లేఖ

  • ఛత్తీస్ గఢ్- తెలంగాణ బార్డర్ లో సర్జికల్ స్ట్రైక్స్
  • భద్రతా బలగాల దాడిని తిప్పికొట్టామని మావోయిస్టుల వివరణ
  • జనవరి 11న ఛత్తీస్ గఢ్ చరిత్రలో చీకటి రోజని వ్యాఖ్య
మావోయిస్టు నేత, కమాండర్ మాడ్వి హిడ్మా చనిపోయారంటూ జరుగుతున్న ప్రచారాన్ని మావోయిస్టులు ఖండించారు. హిడ్మా బతికే ఉన్నాడని తేల్చిచెప్పారు. ఈమేరకు మావోయిస్టు ప్రతినిధి సమత పేరుతో ఓ ప్రకటన విడుదల చేశారు. ఇందులో భద్రతా బలగాల తీరును తీవ్రంగా విమర్శించారు. ఈ నెల 11న ఛత్తీస్ గఢ్ చరిత్రలో చీకటి రోజని, భద్రతా బలగాలు సర్జికల్ స్ట్రైక్స్ పేరుతో కొత్త రకం ఆపరేషన్ నిర్వహించాయని ఆరోపించారు. హెలికాప్టర్లు, డ్రోన్లతో ఛత్తీస్ గఢ్ - తెలంగాణ సరిహద్దుల్లోని గ్రామాలపై విరుచుకుపడ్డారని విమర్శించారు.

నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ఎస్ జీ), ఎయిర్ ఫోర్స్ సిబ్బంది అమాయకులపై డ్రోన్లతో కాల్పులు జరిపారని మావోయిస్టులు ఆరోపించారు. ఈ దాడిలో చాలా మంది గ్రామీణులు గాయపడ్డారని చెప్పారు. భద్రతా బలగాల దాడిని తాము ధీటుగా తిప్పికొట్టామని చెప్పారు. హిడ్మాను లక్ష్యంగా చేసుకొని జరిపిన దాడిలో తమ మహిళా సభ్యురాలు ఒకరు ప్రాణాలు కోల్పోయారని, తాము జరిపిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు జవాన్లు గాయపడ్డారని వివరించారు. కమాండర్ మాడ్వి హిడ్మా క్షేమంగా ఉన్నారని ఈ ప్రకటనలో స్పష్టం చేశారు.


More Telugu News