ఏపీలో ఇక ప్లాస్టిక్ డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ కార్డులు!

  • ఏడాదిన్నర కాలంగా నిలిచిపోయిన స్మార్ట్ కార్డుల జారీ
  • పెండింగులో వేలాది డ్రైవింగ్ లైసెన్స్ లు, ఆర్సీలు
  • క్యూఆర్ కోడ్‌తో పీవీసీ కార్డులు తీసుకొచ్చే యోచన
  • త్వరలోనే టెండర్లు పిలవనున్న అధికారులు
ఏపీలో ఇకపై డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీలను ప్లాస్టిక్ కార్డుల రూపంలో జారీ చేయనున్నారు. ప్రస్తుతం స్మార్ట్ కార్డులు ఇస్తుండగా, ఇకపై క్యూఆర్ కోడ్‌తో పీవీసీ కార్డులు జారీ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రవాణాశాఖ కార్యాలయాల్లోనూ కలిపి నెలకు 3 లక్షల డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీలు జారీ అవుతున్నాయి. ఈ స్మార్ట్ కార్డులలో ఉండే చిప్‌లోని వివరాలను రీడ్ చేసే యంత్రాలు రవాణాశాఖ అధికారుల వద్ద కానీ, పోలీసుల వద్ద కానీ లేవు. దీంతో చిప్ కార్డుల వల్ల ఉపయోగం లేకుండా పోతోంది. మరోవైపు, రాష్ట్రంలో మూడేళ్లుగా స్మార్ట్ కార్డుల జారీ అంతంత మాత్రంగానే ఉండగా, ఏడాదిన్నర కాలంగా కార్డుల సరఫరా నిలిచిపోయింది. దీంతో వేలాదికార్డులు పెండింగులో ఉండిపోయాయి.

ఈ నేపథ్యంలో ఇప్పుడు స్మార్ట్ కార్డుల స్థానంలో క్యూఆర్ కోడ్‌తో పీవీసీ కార్డులు జారీ చేయాలని నిర్ణయించారు. విజయవాడ, విశాఖపట్టణంలో ప్రయోగాత్మకంగా వీటిని సరఫరా చేశారు. తెలంగాణలో ఇప్పటికే చిప్ లేని కార్డులను జారీ చేస్తున్న నేపథ్యంలో ఏపీలోనూ అటువంటివే జారీ చేయాలని అధికారులు నిర్ణయించారు. వాటిపై క్యూఆర్ కోడ్‌ను ముద్రించడం ద్వారా నకిలీ కార్డులకు అడ్డుకట్ట వేయాలని భావిస్తున్నారు. త్వరలోనే ఈ కార్డుల జారీకి సంబంధించి టెండర్లు పిలిచే అవకాశం ఉంది.


More Telugu News