మూవీ రివ్యూ: 'కల్యాణం కమనీయం'

  • యూవీ బ్యానర్లో వచ్చిన 'కల్యాణం కమనీయం'
  • సంక్రాంతి బరిలోకి దిగిన చిన్న సినిమా ఇదే 
  • రొటీన్ గా అనిపించే కథ 
  • ఆసక్తికరంగా సాగని కథనం 
  • ప్రియా భవాని శంకర్ నటన హైలైట్ 
సంతోష్ శోభన్ వరుస సినిమాలతో ముందుకు వెళుతున్నాడు. ఇంతకుముందు చేసిన రెండు సినిమాలు సరిగ్గా ఆడకపోవడంతో, సంక్రాంతి బరిలోకి దిగిన 'కల్యాణం కమనీయం' సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు. యూవీ కాన్సెప్ట్స్  బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి అనిల్ కుమార్ ఆళ్ల దర్శకత్వం వహించాడు. ప్రియా భవానిశంకర్ కథనాయికగా నటించిన ఈ సినిమా కి,పెద్ద సినిమా తరహాలోనే గట్టిగానే పబ్లిసిటీ చేశారు. అలాంటి ఈ సినిమా ఆడియన్స్ కి ఎంతవరకూ కనెక్ట్ అవుతుందనేది చూద్దాం.

తమకి కాబోయేవాడి విషయంలో ఏ అమ్మాయి అయినా ఎన్నో కలలు కంటుంది. తన పట్ల ఎంత ప్రేమను చూపిస్తాడో .. అంత బాధ్యతగాను ఉండాలని కోరుకుంటుంది. తనకంటే ఓ నాలుగు మెట్లపైన  .. తనకంటే ఓ నాలుగు అడుగులు ముందు ఉండాలని ఆశపడుతుంది. అలాంటి అమ్మాయికి ఒక బాధ్యతలేని బద్ధకస్తుడైన భర్త దొరికితే ఇక ఆ కాపురంలో కలతలు చెలరేగడం ఖాయమే. 'కల్యాణం కమనీయం' సినిమా ఇదే లైన్ పై నడుస్తుంది. 

  శివ (సంతోష్ శోభన్) శ్రుతి (ప్రియా భవానిశంకర్) నాలుగేళ్లుగా ప్రేమించుకుంటారు. తమ ప్రేమ విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకుని వెళతారు. శ్రుతి ఉద్యోగం చేస్తోంది .. శివకి ఇంకా ఉద్యోగం రాలేదు .. అందువలన అతనికి కూడా ఏదైనా ఉద్యోగం వచ్చాక ఈ పెళ్లిని జరిపిద్దామని శ్రుతి తండ్రితో ప్రసాదరావు (కేదార్ శంకర్) చెబుతాడు. తన కొడుకు సోమరితనం గురించి తెలిసిన కారణంగానే ప్రసాదరావు ఆ మాట అంటాడు. 

అయితే శ్రుతి తల్లి కేన్సర్ తో బాధపడుతోందనీ .. ఆమె సాధ్యమైనంత తొందరగా తన కూతురు పెళ్లి చూడాలని అనుకుంటోందనే విషయాన్ని శ్రుతి తండ్రి వ్యక్తం చేస్తాడు. దాంతో ప్రసాదరావు ఆ పెళ్లికి అంగీకరిస్తాడు. శివ - శ్రుతి ఇద్దరూ ఇలా పెళ్లి కాగానే అలా వేరు కాపురం పెడతారు. శ్రుతి జాబ్ కి వెళ్లి వస్తుంటే . వంట పని చేస్తూ ఇంటి దగ్గరే హ్యాపీగా శివ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. 

శివకి జాబ్ లేకపోవడం వలన పని మనిషి దగ్గర నుంచి అందరికీ లోకువైపోతాడు. ఇక తన కొలీగ్స్ ముందు శ్రుతి కూడా అవమానంగా భావిస్తూ ఉంటుంది. మరో వైపున ఆఫీసులో ఆమె మేనేజర్ భూషణ్ (సత్యం రాజేశ్) లైంగికంగా వేధిస్తుంటాడు. ఈ నేపథ్యంలోనే జాబ్ చూసుకోమంటూ శివపై ఆమె ఒత్తిడి తీసుకొస్తుంది. జాబ్ కోసం ఒక కన్సల్టెన్సీ ఆఫీసు తనే పది లక్షలు సర్దుబాటు చేస్తుంది. అయితే ఆ పది లక్షలతో పాటు .. తన సర్టిఫికెట్స్ ను కూడా శివ పోగొట్టుకుంటాడు. అప్పుడు శివ ఏం చేస్తాడు? ఆ తరువాత చోటుచేసుకునే పరిమాణాలు ఎలాంటివి? అనేదే కథ. 

అనిల్ కుమార్ కి ఇది దర్శకుడిగా మొదటి సినిమా. ఆయన ఎంచుకున్నది చాలా సింపుల్ లైన్ .. అది కూడా కొత్తదేం కాదు. ఏదో ఒక విషయంపై భార్యాభర్తల మధ్య కీచులాట జరగడం .. ఇద్దరి మధ్య దూరం పెరగడం .. విడిపోయేవరకూ వెళ్లడం .. ఆ తరువాత మనస్పర్థలు తొలగిపోయి ఒకటై పోవడం వంటి కథలు ఇంతకుముందు చాలానే చూసేసి ఉన్నారు. కథ పాతదే అయినా .. కథనంలో అనూహ్యమైన ట్విస్టులు లేకపోయినా, తాను అనుకున్న విషయాన్ని నీట్ గా తెరపై పెట్టాడు. 

రెండు మధ్యతరగతి కుటుంబాలు .. ప్రేమ .. పెళ్లి .. హాయిగా తిని తిరిగేద్దాం .. బాధ్యత లేకుండా బ్రతికేద్దాం అనుకునే హీరో ఒక వైపు, తన భర్తను తనతో పాటు నలుగురూ గౌరవంగా చూడాలనుకునే  హీరోయిన్ ఒక వైపు .. తన క్రింద పనిచేసే హీరోయిన్ ను ఎలాగైనా లొంగదీసుకోవాలనుకునే చిన్నపాటి విలన్ పాత్ర ఒకటి. కథ అంతా కూడా ఈ మూడు పాత్రల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. 

ఉన్నవి చాలా తక్కువ పాత్రలు .. అయినా ఆ పాత్రలను దర్శకుడు చాలా సహజంగా మలిచాడు. ప్రియా భవాని శంకర్ కి ఇది తెలుగులో ఫస్టుమూవీ. ఆమె నటన ఈ సినిమాకి హైలైట్.  శ్రావణ్ భరద్వాజ్ అందించిన బాణీలు అప్పటికప్పుడు సందర్భాన్ని బట్టి వచ్చిపోతుంటాయి. బ్యాగ్ గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగానే ఉంది. కార్తీక్ ఘట్టమనేని కెమెరా పనితనం మంచి మార్కులు తెచ్చుకుంటుంది. ప్రతి సన్నివేశాన్ని సహజత్వానికి చాలా దగ్గరగా ఆవిష్కరించాడు. సత్య ఎడిటింగ్ వర్క్ ఓకే ... ఎక్కడా అనవసరమైన సీన్స్ కనిపించవు. అందువల్లనే నిడివి కూడా చాలా తక్కువగా అనిపిస్తుంది.  

ఈ సినిమాకి మరుధూరి రాజా సంభాషణలు అందించారు. కామెడీకి సంబంధించిన కంటెంట్ అయితే ఆయన తన కలం బలం చూపించడానికి అవకాశం ఉండేది. ఈ కథలో అలాంటి అవకాశం లేకపోవడం వలన, సర్వ సాధారణంగా మాట్లాడుకునే మాటలతో మరింత సహజత్వాన్ని తీసుకొచ్చారు. యూవీ వంటి  పెద్ద బ్యానర్ లో చేసినప్పటికీ, దర్శకుడు కావలసినంతనే ఖర్చు పెట్టించాడు. అంతా బాగానే ఉంది .. కాకపోతే అసలైన కథ పాతదే కావడం .. కథనం రొటీన్ గా నడవడమే ఈ సినిమాకి సంబంధించిన ప్రధానమైన లోపంగా కనిపిస్తుంది.



More Telugu News