దివ్యాంగుడైన క్లయింటును వీపుపై మోసుకుంటూ కోర్టుకు తీసుకువచ్చిన న్యాయవాది

  • కొట్టాయంలో ఘటన
  • సివిల్ కేసు విచారణ కోసం కోర్టుకు వచ్చిన దివ్యాంగుడు సజీవన్
  • మొదటి అంతస్తులో ఉన్న కోర్టు హాల్
  • నిస్సహాయంగా చూస్తున్న సజీవన్ ను మోసుకెళ్లిన రయిన్
కేరళకు చెందిన న్యాయవాది రయిన్ కేఆర్ మానవత్వానికి ప్రతిబింబంలా నిలిచారు. పోలియో సోకి అవిటివాడైన తన క్లయింటును ఆయన తన వీపుపై మోసుకుంటూ కోర్టుకు తీసుకువచ్చి, అందరి అభినందనలు అందుకున్నారు. 

40 ఏళ్ల రయిన్ కేఆర్ కొట్టాయం కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. సజీవన్ అనే 60 ఏళ్ల దివ్యాంగుడి కేసును ఆయన వాదిస్తున్నారు. అది ఓ సివిల్ కేసు. ఈ నెల 7న ఈ కేసు విచారణ కొట్టాయం కోర్టులో జరిగింది. విచారణకు హాజరయ్యేందుకు సజీవన్ తన మూడు చక్రాల స్కూటర్ పై కోర్టు వద్దకు వచ్చారు. కోర్టు హాల్ మొదటి  అంతస్తులో ఉండడంతో ఆయన పైకి ఎక్కలేకపోయారు. 

దాంతో న్యాయవాది రయిన్... సజీవన్ ను తన వీపుపై మోసుకుంటూ మెట్ల మీదుగా మొదటి అంతస్తులోని కోర్టు హాల్ కు తీసుకువచ్చారు. ఇది అందరి దృష్టిని ఆకర్షించింది. ఇతర న్యాయవాదులు కూడా రయిన్ చర్యను మనస్ఫూర్తిగా మెచ్చుకున్నారు. 

గతంలో కోర్టు హాల్ ఓ పాత భవనంలో గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఉండేది. అయితే దాన్ని మరో భవనంలోని మొదటి అంతస్తుకు మార్చారు. ఈ విషయం సజీవన్ కు కోర్టు వద్దకు వచ్చాకే తెలిసింది. దాంతో ఆయన మెట్లు ఎక్కలేక నిస్సహాయుడై ఉండగా, న్యాయవాది రయిన్ ఎంతో గొప్ప మనసుతో వీపుపై మోసుకుంటూ తీసుకెళ్లారు. అంతేకాదు, విచారణ ముగిసిన తర్వాత మళ్లీ వీపుపై మోసుకుంటూ కిందికి తీసుకువచ్చారు.


More Telugu News