సికింద్రాబాద్- వైజాగ్ ‘వందే భారత్’ టికెట్ ధర ఎంతంటే..!

  • చెయిర్ కార్ లో ప్రయాణానికి రూ.1,720..
  • ఎగ్జిక్యూటివ్ క్లాస్ ప్రయాణానికి రూ.3,170 వెచ్చించాల్సిందే
  • ఇందులోనే క్యాటరింగ్ చార్జీలు కలిసి ఉంటాయన్న రైల్వే శాఖ
  • రేపు ఉదయం వందే భారత్ పరుగులు.. ఈ రోజు నుంచే బుకింగ్స్
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లను కలుపుతూ రేపటి (జనవరి 15) నుంచి పరుగులు తీయనున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ కు రైల్వే శాఖ బుకింగ్స్ ఓపెన్ చేసింది. శనివారం నుంచి ఈ ట్రెయిన్ టికెట్లను అందుబాటులో ఉంచింది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం టికెట్ ధరలను అధికారికంగా విడుదల చేసింది. ట్రైన్ రాకపోకల సమయాలను వెల్లడించింది. దేశవ్యాప్తంగా వివిధ మార్గాల్లో ఇప్పటి వరకు ఏడు వందే భారత్ రైళ్లు పరుగులు తీస్తుండగా.. ఇది ఎనిమిదో రైలు అని పేర్కొంది. ఈ ట్రైన్ లోని ఏసీ, నాన్ ఏసీ బోగీలలో కలిపి మొత్తం 1128 మంది ప్రయాణించవచ్చని తెలిపింది.

వారంలో ఆరు రోజులు ఈ రైలు సికింద్రాబాద్-విశాఖల మధ్య పరుగులు పెడుతుంది. ఆదివారం ఈ సర్వీసులు అందుబాటులో ఉండవని రైల్వే శాఖ తెలిపింది. టికెట్ ధరల విషయానికి వస్తే.. వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో చెయిర్ కార్ ప్రయాణానికి ఒక్కో టికెట్ ధర రూ.1,720. ఇందులో బేస్ ఫేర్ రూ.1,206 లు కాగా సూపర్ ఫాస్ట్ చార్జీల కింద రూ.45, జీఎస్టీ రూ.65, రిజర్వేషన్ చార్జీ రూ.40, కేటరింగ్ కు రూ.364 చొప్పున వసూలు చేయనున్నట్లు తెలిపింది.

ఎగ్జిక్యూటివ్ క్లాస్ ప్రయాణానికి ఒక్కో ప్రయాణికుడు రూ. 3,170 చెల్లించాలని రైల్వే అధికారులు తెలిపారు. ఇందులో బేస్ ఫేర్ రూ.2,485 లు కాగా సూపర్ ఫాస్ట్ చార్జీల కింద రూ.75, జీఎస్టీ రూ.131, రిజర్వేషన్ చార్జీ రూ.60, కేటరింగ్ కు రూ.419 చొప్పున వసూలు చేస్తామని తెలిపారు.

టైమింగ్స్ వివరాలు..
వైజాగ్ నుంచి ప్రతిరోజూ ఉదయం 5.55 గంటలకు వందే భారత్ ట్రైన్ స్టార్ట్ అవుతుంది. ఉదయం 7.55 గంటలకు రాజమండ్రి, ఉదయం 10 గంటలకు విజయవాడ, ఉదయం 11 గంటలకు ఖమ్మం, మధ్యాహ్నం 12.05 గంటలకు వరంగల్, మధ్యాహ్నం 2.15 నిమిషాలకు సికింద్రాబాద్ కు చేరుకుంటుంది. సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు స్టార్ట్ అవుతుంది. వరంగల్ కు మధ్యాహ్నం 4.35 గంటలకు, ఖమ్మం మధ్యాహ్నం 5.45 గంటలకు, సాయంత్రం 7 గంటలకు విజయవాడ, రాత్రి 8.50 గంటలకు రాజమండ్రి, రాత్రి 11.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.


More Telugu News