అలాగైతే మేం ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం కావాలంటామని మంత్రి ధర్మాన సంచలన వ్యాఖ్యలు

  • ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలని టీడీపీ అంటే 50  ఏళ్లు వెనక్కి వెళ్లిపోతామన్న మంత్రి
  •  తమ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం తీసుకుందన్న ధర్మాన
  • ఎవరితో కలిసి ప్రయాణిస్తారో తేల్చుకోవాలని పవన్ కు ప్రశ్న
ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ఒకే రాజధానిగా అమరావతి ఉండాలని టీడీపీ అంటే తమ ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం కావాలంటామన్నారు. అమరావతి కోసం నిధులు వెచ్చిస్తామని అంటే తాము ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం కోసం పట్టుబడతామని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మళ్లీ  ఒకే రాజధాని అంటున్నారని, ఇలాగైతే మళ్లీ  50 ఏళ్లు వెనక్కివెళ్లిపోవాల్సి వస్తుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 65 సంవత్సరాల పాటు ఓ ప్రాంత ప్రజల నోరునొక్కి ప్రభుత్వ ధనాన్ని ఓ ప్రాంతానికి కేటాయించి అభివృద్ధి చేశాక హైదరాబాద్ నుంచి కట్టుబట్టలతో రావాల్సి వచ్చిందని ధర్మాన అన్నారు. 

టీడీపీ వాళ్లు అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తామని చెబుతున్నారని, తాను పరిపాలన వికేంద్రీకరణ కావాలంటున్నానని చెప్పారు. మూడు రాజధానులపై తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, పాలనా రాజధానిగా విశాఖను చేయాలని నిర్ణయించిందని మంత్రి చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు ఒకే రాజధాని కావాలంటే తమకు ఉత్తరాంధ్రను రాష్ట్రంగా ఇచ్చేయండని అన్నారు. అమరావతి కొందరు క్యాపిటలిస్టుల కోసం ఏర్పాటు చేస్తున్నదని, ఈ విషయంలో ఎవరి వైపు ప్రయాణించాలనుకుంటున్నారు? ఎవరివైపు నిలిచి ప్రశ్నిస్తున్నారు? అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ధర్మాన ప్రశ్నించారు. పవన్.. చంద్రబాబుపై తనకున్న అభిప్రాయం చెప్పాలని డిమాండ్ చేశారు. తాను విశాఖలో భూమి కబ్జా చేశానని అంటున్నారని, ఇది నిజం కాదని ధర్మాన చెప్పారు.


More Telugu News