తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు: చంద్రబాబు

  • సంక్రాంతి కోసం స్వగ్రామం వచ్చిన చంద్రబాబు
  • సంక్రాంతి విశిష్టతను వివరిస్తూ ప్రకటన
  • పేదలకు సంక్రాంతి కానుకలు ఇచ్చామని వెల్లడి
  • ఇప్పటి ప్రభుత్వం ఆ సంప్రదాయాన్ని అనుసరించడంలేదని ఆరోపణ
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సంక్రాంతి పండుగ సందర్భంగా స్వగ్రామం నారావారిపల్లె చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన తెలుగువారికి భోగి-సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. 

క్రాంతి అంటే అభ్యుదయం అని, సంపద పరంగా, సంస్కృతి పరంగా పురోగతిని ఆశిస్తూ వచ్చే పండుగ సంక్రాంతి అని వివరించారు. భోగి- సంక్రాంతి- కనుమ... మూడు రోజుల సంక్రాంతి పండుగ తెలుగునాట పల్లెల్లో సందళ్లు, సరదాలు, జ్ఞాపకాలు పంచే అతి పెద్ద పండుగ అని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరూ తమతమ మూలాలైన పల్లె సీమలకు తరలివచ్చి ఆత్మీయతను పంచుకునే విశిష్టమైన పండుగ అని చంద్రబాబు వెల్లడించారు. 

"ధనిక, పేద తారతమ్యాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలు పండుగను సంతోషంగా జరుపుకోవాలని నాడు ఆలోచించాం. అందులో భాగంగానే గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తొలిసారిగా పేదలకు పండుగ కానుకలను ఇచ్చే సంప్రదాయానికి నాంది పలికాం. ఆర్థిక స్థోమత లేని వారి ఇంట్లో కూడా పండుగ శోభ కనిపించాలని సంక్రాంతి కానుకలు ఇచ్చాం. 

ఒక్క సంక్రాంతికే కాదు. రంజాన్, క్రిస్మస్ పర్వదినాలకి కూడా పండుగ కానుకలిచ్చాం. 1 కోటి 17 లక్షల కుటుంబాలకు సంక్రాంతి కానుక ఇచ్చాం. 12 లక్షల మందికి రంజాన్ కానుక, 18 లక్షల మందికి క్రిస్మస్ కానుకలు కూడా అందించాం. ఏడాదికి రూ.350 కోట్లు ఖర్చు చేసి పేదల ఇంట కూడా పండుగ సంతోషాన్ని నింపాం. ప్రభుత్వం ఇచ్చిన ఆ చిరు కానుకే పండగపూట పేదల మనసులకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. 

రాష్ట్రంలో వచ్చిన ఈ స్పందన చూసిన, నాటి టీడీపీ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకుని తమిళనాడులో కూడా సంక్రాంతి కానుకల పంపిణీ ప్రారంభించారు. అలాంటిది నేటి ప్రభుత్వం ఆ దిశగా కనీస ఆలోచన చెయ్యకపోవడం పేదల పట్ల వారికున్న అప్రాధాన్యతకు నిదర్శనం. 

సంక్రాంతి అంటేనే సాగు, సౌభాగ్యాలకు పట్టం కట్టే పండుగ. రైతుల కృషి ఫలించి పంటలు ఇళ్లకు చేరే సంతోష సమయం. సాగు వ్యయం తగ్గించి, పంటకు గిట్టుబాటు ధర కల్పించినప్పుడే అన్నదాతకు అసలైన సంక్రాంతి అని భావించాం. నాటి ప్రభుత్వంలో 58.29 లక్షల మంది రైతులకు రూ. 15,279 కోట్ల రుణమాఫీ చేసినా, అన్నదాత సుఖీభవ పథకం తీసుకువచ్చినా, పెద్ద ఎత్తున డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ అమలు చేసినా వ్యవసాయాన్ని నిలబెట్టాలనేదే మా ఆలోచన. రైతు రథం కింద ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్ల కొనుగోలుకు సబ్సిడీలతో రైతన్నలకు తోడుగా నిలిచాం. 

సంక్రాంతి  పండుగ సందర్భంగా దేశ విదేశాల నుండి స్వగ్రామాలకు తరలి వస్తున్న ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. వివిధ రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఉన్నత స్థానాల్లో స్థిరపడిన మీరు గ్రామాభివృద్దికి ఇతోధికంగా సహాయం చేయాలని కోరుతున్నాను. ఈ పండగ సందర్భంగా ఆ దిశగా సంకల్పం తీసుకోవాలని కోరుతున్నాను. 

గతంలో జన్మభూమి అనే కార్యక్రమంతో గ్రామాలను అభివృద్ది చేసుకున్నాం. అప్పట్లో ప్రవాసాంధ్రులు కదలి వచ్చి పల్లెల్లో బడులు, రోడ్లు, తాగునీటి సౌకర్యాలకు చేయూతనిచ్చారు. నాటి జన్మభూమి ఇచ్చిన అద్భుత ఫలితాలు ఇప్పటికీ అందరికీ గుర్తే. 

ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో నాటి ఆ స్ఫూర్తి మళ్ళీ తెలుగువారిలో కలగాలని ఆశిస్తున్నాను. అందరూ బాగుంటేనే నిజమైన పండుగ అనే సిద్ధాంతాన్ని నమ్మి రాష్ట్రాభివృద్దిలో మీరంతా భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ...తెలుగు ప్రజలందరికీ మరోసారి భోగి, సంక్రాంతి, కనుమ పండుగల శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను" అని చంద్రబాబు తన ప్రకటనలో పేర్కొన్నారు.


More Telugu News