జగన్ పై దాడి చేసిన నిందితుడు శ్రీనివాస్ కు బెయిల్ నిరాకరించిన విజయవాడ ఎన్ఐఏ కోర్టు

  • ఏపీలో సంచలనం సృష్టించిన కోడి కత్తి వ్యవహారం
  • దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ
  • బాధితుడిగా ఉన్న సీఎం విచారణకు రావాల్సిందేనన్న కోర్టు
  • స్టేట్ మెంట్ రికార్డు చేశామన్న ఎన్ఐఏ
  • చార్జిషీటులో ఎందుకు పేర్కొనలేదన్న న్యాయస్థానం
ఏపీలో సంచలనం సృష్టించిన కోడి కత్తి కేసులో నిందితుడు శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ ను ఎన్ఐఏ కోర్టు తిరస్కరించింది. ఈ కేసు విచారణను జనవరి 31కి వాయిదా వేసింది. కోడి కత్తి కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో, విజయవాడలోని ఎన్ఐఏ కోర్టులో నేడు విచారణ జరిగింది. ఈ సందర్భంగా న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యవహారంలో బాధితుడిగా ఉన్న ముఖ్యమంత్రి కోర్టుకు రావాల్సిందేనని స్పష్టం చేసింది. 

కేసులో బాధితుడిగా ఉన్న వ్యక్తి (సీఎం)ని ఇంతవరకు ఎందుకు విచారించలేదని నిందితుడి తరఫున న్యాయవాది సలీమ్ ప్రశ్నించారు. అందుకు ఎన్ఐఏ న్యాయవాది బదులిస్తూ, స్టేట్ మెంట్ రికార్డు చేశామని కోర్టుకు తెలిపారు. దాంతో, స్టేట్ మెంట్ రికార్డు చేస్తే చార్జిషీట్ లో ఎందుకు పేర్కొనలేదని కోర్టు ప్రశ్నించింది. బాధితుడిని విచారించకుండా మిగతా సాక్షులను విచారించి ఉపయోగం ఏముందని కోర్టు అభిప్రాయపడింది. 

ఈ నెల 31 నుంచి విచారణకు షెడ్యూల్ ప్రకటించిన న్యాయస్థానం... బాధితుడు సహా మిగతా వారంతా తప్పనిసరిగా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.


More Telugu News