డబ్బులిచ్చి మరీ జాతీయ జట్టుకు ఆడుతున్నారట.. వేల్స్ హాకీ ఆటగాళ్ల దుస్థితి!

  • హాకీ ప్రపంచ కప్ లో పాల్గొంటున్న వేల్స్ వింత పరిస్థితి
  • ఆ దేశంలో హాకీకి ఆదరణ, ప్రోత్సాహం కరవు
  • విరాళాలతో భారత్ కు వచ్చిన వైనం
సాధారణంగా ఏ క్రీడలోనైనా జాతీయ జట్టుకు ఆడితే ఆటగాళ్లకు మంచి గుర్తింపు లభిస్తుంది. గెలిస్తే పతకాలు వస్తాయి. ప్రభుత్వం ప్రోత్సాహకాల రూపంలో డబ్బులు కూడా ఇస్తుంది. కానీ, వేల్స్ దేశంలో హాకీ ఆటగాళ్ల పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. వాళ్లు సొంతగా డబ్బులు చెల్లించి మరీ వేల్స్ దేశానికి ఆడుతున్నారు. ఇందుకోసం ఒక్కో ఆటగాడు ఏడాదికి వెయ్యి పౌండ్లు చెల్లించి వేల్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒడిశా వేదికగా జరుగుతున్న హాకీ ప్రపంచ కప్ లో పాల్గొనేందుకు వీరు సొంత ఖర్చులతో భారత్ వచ్చారు. 

ఈ విషయాన్ని ఆ జట్టు కోచ్ డేనియల్ న్యూకోంబె తెలిపారు. తమ దేశంలో హాకీకి అంతగా ఆదరణ, ప్రాచుర్యం లేకపోవడం ఇందుకు కారణమని అన్నారు. దాంతో, ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సహకారం లభించడం లేదన్నారు. ఈ నేపథ్యంలో భారత్ వచ్చేందుకు విమాన ప్రయాణం, వసతి, భోజన ఖర్చుల కోసం ప్రజల నుంచి విరాళాల రూపంలో 25 వేల పౌండ్లు సేకరించారు. ప్రపంచ కప్ తర్వాత అయినా తమ జట్టుకు ఆదరణ లభిస్తుందని కోచ్ డేనియల్ ఆశిస్తున్నారు. కాగా, ఈ టోర్నీలో వేల్స్.. భారత్, స్పెయిన్, ఇంగ్లండ్ తో కలిసి గ్రూప్–డి బరిలో నిలిచింది.


More Telugu News