షిరిడీ దర్శనానికి వెళుతూ ఘోర ప్రమాదం.. పది మంది మృతి

  • మహారాష్ట్రలో నాసిక్- షిరిడీ హైవేపై బస్సు, ట్రక్కు ఢీ 
  • 10 మంది మృతి, 34 మందికి గాయాలు
  • మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం ప్రకటించిన మహారాష్ట్ర సీఎం
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు– ట్రక్కు ఢీకొన్న ఘటనలో 10 మంది ప్రయాణికులు మృతి చెందారు. షిరిడీ సాయిబాబా దర్శనానికి థానే నుంచి 50 మంది భక్తులను తీసుకెళ్తున్న ట్రావెల్స్ బస్సు అతివేగంతో దూసుకొచ్చి ట్రక్కును బలంగా ఢీకొట్టింది. రెండు వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. నాసిక్- షిరిడీ జాతీయ రహదారిపై పఠారే సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో 10 మంది అక్కడికక్కడే మృతి చెందారు. 34 మంది గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. 

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పది మంది మృతుల్లో  ఐదుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. గాయపడిన వారిని సిన్నార్‌లోని రూరల్ ఆసుపత్రికి, మరికొందరిని స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి పొగమంచు, అతివేగం కారణం అని భావిస్తున్నారు. ప్రమాద ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు.


More Telugu News