'బొమ్మరిల్లు' తరువాత 'వరిసు' నా కళ్లవెంట నీళ్లు తెప్పించింది: దిల్ రాజు

  • తమిళనాట నిన్న విడుదలైన 'వరిసు'
  • ఈ 14న తెలుగు వెర్షన్ 'వారసుడు' విడుదల 
  • 'వరిసు' రెస్పాన్స్ పట్ల ఆనందం 
  • తమన్, వంశీ పైడిపల్లి కష్టమే కారణమని వెల్లడి
విజయ్ - రష్మిక జంటగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'వరిసు' సినిమాను దిల్ రాజు నిర్మించారు. తమిళనాట నిన్న విడుదలైన ఈ సినిమా అక్కడ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ నెల 14వ తేదీన 'వారసుడు' టైటిల్ తో ఈ సినిమా ఇక్కడ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం నిర్వహించిన ప్రెస్ మీట్ లో దిల్ రాజు మాట్లాడారు. 

"పది .. పదిహేను ఏళ్ల తరువాత మీడియావారి కోసం నేను ఈ సినిమా స్పెషల్ షో వేశాను. మీడియావారు లోపాలే వెదుకుతారని నాకు తెలుసు. అయినా నా సినిమాపై నాకు గల నమ్మకంతోనే అలా చేశాను. అందరూ కూడా ఈ సినిమాపట్ల తమ సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఆభినందనలు అందజేశారు" అన్నారు.

"ఈ సినిమా కోసం నాకంటే వంశీ పైడిపల్లి - తమన్ ఎక్కువగా కష్టపడ్డారు. చివరి పది రోజుల పాటు వాళ్లు నిద్రపోలేదు. అందువల్లనే ఈ రోజున ఈ సినిమాకి తమిళనాట ఇంతటి ఆదరణ లభిస్తోంది. అప్పుడెప్పుడో 'బొమ్మరిల్లు' సినిమా రెస్పాన్స్ చూసి కళ్లవెంట నీళ్లొచ్చాయి. మళ్లీ ఇన్నాళ్లకి ఈ సినిమా నాకు ఆనందబాష్పాలు వచ్చేలా చేసింది" అంటూ చెప్పుకొచ్చారు.


More Telugu News