సేతు సముద్రం ప్రాజెక్టుపై తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం

  • అరేబియా తీరం నుంచి తూర్పు తీరం వచ్చేందుకు అత్యధిక సమయం
  • భారత్, శ్రీలంక మధ్య రామసేతు
  • రామసేతు మీదుగా ప్రయాణిస్తే తక్కువ దూరం
  • తీర్మానానికి బీజేపీ మద్దతు
  • రామసేతు దెబ్బతినకుండా ప్రాజెక్టు చేపట్టాలన్న బీజేపీ
భారతదేశానికి పశ్చిమాన ఉన్న అరేబియా తీరం నుంచి తూర్పు తీరాన్ని చేరుకోవాలంటే ఇప్పటివరకు శ్రీలంక చుట్టూ తిరిగి రావాల్సిన పరిస్థితి ఉంది. అయితే, భారత్, శ్రీలంక మధ్య ఉన్న రామసేతు మీదుగా ప్రయాణిస్తే ఎంతో ప్రయాణ సమయం ఆదా అవుతుంది. ఈ ఉద్దేశంతో ప్రతిపాదించిందే సేతు సముద్రం ప్రాజెక్టు. బ్రిటీష్ పాలకులు 1860లోనే దీని గురించి ప్రస్తావించినా, ఇప్పటికీ ఇది కార్యరూపం దాల్చలేదు. అందుకు ప్రధానమైన కారణం రామసేతు. 

భారత్, శ్రీలంకలను కలుపుతున్నట్టుండే ఆడమ్స్ బ్రిడ్జి లేక రామసేతు రామాయణ కాలం నాటిదని, రాముడు వానరసైన్యం సాయంతో నిర్మించిన వారధి ఇదేనని హిందువుల ప్రగాఢ విశ్వాసం. అందుకే ఈ రామసేతు మీదుగా సేతు సముద్రం ప్రాజెక్టు నిర్మించేందుకు మతపరమైన అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఇక్కడ భారీ నౌకలు ప్రయాణించేందుకు వీలుగా సముద్ర మార్గాన్ని తగినంత లోతుగా తవ్వాల్సి ఉంటుందని, దాంతో రామసేతు దెబ్బతింటుందని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. 

ఈ నేపథ్యంలో, నేడు తమిళనాడు అసెంబ్లీలో సేతు సముద్రం ప్రాజెక్టుపై కీలక తీర్మానం చేశారు. భారతదేశ పశ్చిమ, తూర్పు తీరాలను కలిపేందుకు దగ్గరదారి వంటి ఈ సేతు సముద్రం ప్రాజెక్టును కేంద్రం కొనసాగించాలంటూ ఈ తీర్మానం చేశారు. సీఎం స్టాలిన్ ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టగా, తమిళనాడు బీజేపీ శాఖ సహా అన్ని పార్టీల సభ్యులు మద్దతు పలికారు. 

అయితే రామసేతుకు ఎలాంటి నష్టం జరగకుండా ఈ సేతు సముద్రం ప్రాజెక్టు చేపట్టాలని బీజేపీ ఎమ్మెల్యే నయనార్ నాగేంద్రన్ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే తమిళనాడులో అత్యధికంగా సంతోషించేది తామేనని స్పష్టం చేశారు.


More Telugu News