జీవో నెంబర్ వన్ ను ఈ నెల 23 వరకు సస్సెండ్ చేసిన ఏపీ హైకోర్టు

  • రోడ్లపై సభలు, ర్యాలీలు నిర్వహించకుండా జీవో తెచ్చిన ఏపీ ప్రభుత్వం
  • జీవోను హైకోర్టులో సవాల్ చేసిన సీపీఐ రామకృష్ణ
  • తదుపరి విచారణ జనవరి 23కి వాయిదా 
రాజకీయ పార్టీలు రోడ్ షోలు, సభలు నిర్వహించకుండా ఏపీలోని వైసీపీ ప్రభుత్వం జీవో నెంబర్ వన్ ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ జీవో ప్రజల భావప్రకటనా స్వేచ్ఛను హరించడమేనని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రజల ప్రాథమిక హక్కును హరించేలా జీవో ఉందని తన పిటిషన్ లో ఆయన పేర్కొన్నారు. 

ఈ పిటిషన్ ను నేడు విచారించిన హైకోర్టు జీవో నెంబర్ వన్ ను సస్పెండ్ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రామకృష్ణ తరపున అశ్వినీ కుమార్ వాదనలను వినిపించారు. ఈ జీవో రాజ్యాంగ విరుద్ధమని ఆయన వాదించారు. బ్రిటిష్ కాలంనాటి చట్టాన్ని తీసుకొచ్చారని, అప్పుడు కూడా లేని నిబంధనలను ఇప్పుడు విధించారని చెప్పారు. ఈ జీవో నిబంధనలకు విరుద్ధంగా ఉందని ఈ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ నెల 23వ తేదీ వరకు జీవోపై సస్పెన్షన్ విధించింది. తదుపరి విచారణను జనవరి 23కి వాయిదా వేసింది.  

 మరోవైపు, ఈ సందర్భంగా రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ, ఈ జీవో అన్ని పార్టీలకు వర్తిస్తుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారని... ఆ మరుసటి రోజే రాజమండ్రిలో జగన్ రోడ్ షో నిర్వహించారని, ఆ తర్వాత ప్రతి రోజూ వైసీపీ నేతలు రోడ్ షోలను నిర్వహిస్తూనే ఉన్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి, ప్రజల హక్కులను హరించడానికే ఈ జీవోను తీసుకొచ్చారనే విషయం అర్థమవుతోందని అన్నారు.


More Telugu News