రవాణా వాహనాల పన్నును ప్రభుత్వం భారీగా పెంచింది: యనమల

  • జగన్ ప్రభుత్వంపై ప్రజలకు అసహ్యం కలుగుతోందన్న యనమల
  • బైక్ నుంచి లారీ వరకు కొనుగోళ్లపై లైఫ్ ట్యాక్స్ ను 6 శాతానికి పెంచారని మండిపాటు
  • అన్ని ఛార్జీలను పెంచుతూ ప్రజలపై భారాన్ని మోపుతున్నారని విమర్శ
ధరలను పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తున్నారని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. జగన్ ప్రభుత్వంపై ప్రజలకు అసహ్యం కలుగుతోందని అన్నారు. రవాణా వాహనాల పన్నును వైసీపీ ప్రభుత్వం భారీగా పెంచిందని... దీనివల్ల ప్రజలపై ప్రతి ఏటా రూ. 250 కోట్ల అదనపు భారం పడుతోందని విమర్శించారు. 

తెలుగుదేశం పార్టీ పాలనలో ప్రతి 6 నెలలకు రవాణా శాఖకు రూ. 1,500 కోట్ల ఆదాయం వచ్చేదని... ఇప్పుడు జగన్ బాదుడు వల్ల అది రూ. 2,131 కోట్లకు పెరిగిందని అన్నారు. బైకు నుంచి లారీ వరకు కొనుగోళ్లపై లైఫ్ టైమ్ ట్యాక్స్ ను 6 శాతం పెంచారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు సార్లు మద్యం ధరలను పెంచారని, మూడు సార్లు ఆర్టీసీ టికెట్ ఛార్జీలను పెంచారని, ఏడు సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచారని దుయ్యబట్టారు. దేశంలోనే అత్యధిక పెట్రోల్, డీజిల్ ఛార్జీలు ఏపీలోనే ఉన్నాయని అన్నారు. అన్ని చార్జీలను పెంచుతూ ప్రజలపై వైసీపీ ప్రభుత్వం భారాన్ని మోపుతోందని మండిపడ్డారు.


More Telugu News