‘ఆధునికీకరించాం.. అద్దె పెంచాం’.. గదుల అద్దె వివాదంపై టీటీడీ వివరణ

  • భక్తుల కోరిక మేరకే సౌకర్యాలు పెంచామని వెల్లడి
  • సాధారణ గదుల అద్దె పెంచలేదని స్పష్టం చేసిన టీటీడీ
  • తప్పుడు ప్రచారం ఆపాలని మీడియా ముందుకొచ్చి విజ్ఞప్తి
భక్తుల సూచనల మేరకు వసతి గృహాల్లో మార్పులు, చేర్పులు చేశామని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు చెప్పారు. మెరుగైన వసతులు కల్పించామని, దానికి అనుగుణంగానే వసతి గృహాల అద్దెను పెంచామని పేర్కొన్నారు. టీటీడీ గదుల అద్దెను భారీగా పెంచేసిందంటూ ప్రచారం చేయడం ఆపాలంటూ మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. గత 30 ఏళ్ల క్రితం నిర్ణయించిన అద్దెనే ఇప్పటి వరకు వసూలు చేశామని తెలిపారు. గదులను ఆధునికీకరించి ఏసీ, కొత్త ఫర్నీచర్, గీజర్లు ఏర్పాటు చేశాకే అద్దె పెంచామని వివరణ ఇచ్చారు.

వసతి సౌకర్యాల కల్పన ఆధారంగా నారాయణగిరి గెస్ట్ హౌస్ లో రూ.150 ఉన్న అద్దెను రూ.1700లకు పెంచినట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా స్పెషల్ టైప్ కాటేజీల అద్దె రూ.750 నుంచి రూ.2,200 లకు పెంచామని పేర్కొన్నారు. సాధారణ భక్తులు బుక్ చేసుకునే రూ.50, రూ.100 గదుల అద్దెలను పెంచలేదని వివరించారు. కాగా, టీటీడీ గదుల అద్దె పెంపుపై ఆంధ్రప్రదేశ్ లోని ప్రతిపక్ష నేతలు మండిపడ్డారు. భక్తులను శ్రీవారికి దూరం చేస్తున్నారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు మండిపడగా.. రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ లలో బీజేపీ ఆందోళన చేపట్టింది.


More Telugu News