అరటి పండుతో రోజును ఆరంభించాలంటున్న ప్రముఖ న్యూట్రిషనిస్ట్

  • రోజంతా కావాల్సినంత ఎనర్జీ ఇస్తుంది
  • జీర్ణ సంబంధ సమస్యలున్న వారికి అనువైన సమయం
  • నీళ్లలో నానబెట్టిన బాదం లేదా కిస్ మిస్ కూడా తినొచ్చు
  • ప్రముఖ న్యూట్రిషనిస్ట్ రుజుతా దివేకర్ సూచనలు 
రోజులో ఉదయం తీసుకునే ఆహారానికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. మిగిలిన రోజంతా ఎంత ఉత్సాహంగా, చురుగ్గా ఉంటామనేది మనం తీసుకునే ఆహారమే నిర్ణయిస్తుంది. రోజులో మొదటి ఆహారం మంచి శక్తితో కూడినది అయి ఉండాలన్నది వైద్య నిపుణుల సూచన. ప్రముఖ న్యూట్రిషనిస్ట్ రుజుతా దివెకర్ అయితే అరటి పండుతో రోజును ఆరంభించాలని సూచిస్తున్నారు. దీనిపై ఆమె తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ (rujuta.diwekar)లో ఓ పోస్ట్ పెట్టారు. దీన్ని పరిశీలించినట్టయితే..

‘‘ఒక అరటి పండు తినడం ద్వారా రోజును ప్రారంభించండి. లేదంటే నీళ్లలో నానబెట్టిన బాదం గింజలు లేదా నీళ్లలో నానబెట్టిన కిస్ మిస్ తినడాన్ని రోజులో ముందుగా చేయాలి. టీ, కాఫీతో కాదు’’ అని ఆమె పోస్ట్ లో సూచించారు. జీర్ణసంబంధ సమస్యలున్నవారు, భోజనం తర్వాత తీపి తినాలనిపించే వారికి ఉదయం అరటి పండు తినాలన్నది ఆమె సూచన. స్థానికంగా పండే అరటి రకాలను వారంలో రెండు నుంచి మూడు సార్లు కొనుగోలు చేసుకోవాలని, వాటిని ప్లాస్టిక్ బ్యాగుల్లో కాకుండా క్లాత్ బ్యాగుల్లో తెచ్చుకోవాలని సూచించారు.

ఇక ప్రీ మెనుస్ట్రువల్ సిండ్రోమ్ (పీఎంఎస్) లేదా రోజంతా నీరసంగా అనిపించే వారు రాత్రంతా నీళ్లలో 6-7 కిస్ మిస్ లను నానబెట్టి, వాటికి రెండు కుంకుమ పువ్వుల పోగులను జోడించి రుతుక్రమానికి పది రోజుల ముందు నుంచి తినాలని దివేకర్ సూచించారు. నల్లటి కిస్ మిస్ ను ఆమె సూచిస్తున్నారు. నల్లవి లేనిపక్షంలో వేరే వాటిని వాడుకోవచ్చు. హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్నవారు, గ్యాస్, ఇరిటబులిటీ, తరచూ మూడ్ మారిపోయే సమస్యలు ఉన్నవారు కూడా ఇలా నీళ్లలో నానబెట్టిన కిస్ మిస్ ను ఉదయాన్నే తినాలన్నది ఆమె సూచన.

ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నవారు, మధుమేహం ఉన్నవారు, పీసీవోడీ లేదా నాణ్యమైన నిద్రలేమి సమస్యతో బాధపడే వారు రాత్రంతా పొట్టు తీసిన బాదం గింజలను నానబెట్టి ఉదయాన్నే తినాలని సూచించారు. వీటిని తిన్న తర్వాత కావాలంటే 15 నిమిషాలు విరామం ఇచ్చి అప్పుడు టీ, కాఫీ తీసుకోవచ్చని దివేకర్ అంటున్నారు. ఉదయాన్నే నీరు తాగే అలవాటున్న వారు నీరు తాగిన తర్వాత వీటిని తినొచ్చని తెలిపారు. అలాగే, వీటిని తిన్న 20 నిమిషాల తర్వాత వ్యాయామాలు చేసుకోవచ్చట. గంట తర్వాత బ్రేక్ ఫాస్ట్ చేయొచ్చు. కరీనా కపూర్, అలియా భట్, కంగనా రనౌత్ తదితర సెలబ్రిటీలకు దివేకర్ పోషకాహార సూచనలు ఇవ్వడం గమనార్హం.


More Telugu News