తెలంగాణకు త్వరలో వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులు

  • ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో నడిపించనున్న ఆర్టీసీ
  • టెండర్లు దక్కించుకున్న జేబీఎం గ్రూప్, అశోక్ లేలాండ్ కంపెనీలు
  • త్వరలో ఒప్పందం.. ఆపై ఏడాదిలో బస్సుల అందజేత
  • డ్రైవర్ జీతం సహా నిర్వహణ మొత్తం ప్రైవేటు సంస్థలదే
  • కిలోమీటరుకు నిర్ణీత మొత్తంలో చెల్లించనున్న రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ
డీజిల్ వినియోగాన్ని తద్వారా పొల్యూషన్ ను తగ్గించడానికి ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థల్లో ఎలక్ట్రిక్ బస్సుల వాడకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ ఆర్టీసీ)కి వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. ప్రైవేటు సంస్థల ద్వారా ఈ బస్సులను టీఎస్ ఆర్టీసికి అందజేయనుంది. 

రాష్ట్రంలో ప్రైవేటు-ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ బస్సులు పరుగులు తీయనున్నాయి. నిర్వహణలో భాగంగా ప్రతీ బస్సుకు హైదరాబాద్ లో కిలోమీటర్ కు రూ.55, గ్రామీణ ప్రాంతాల్లో కిలోమీటరుకు రూ.40 చొప్పున ఆర్టీసీ చెల్లించనుంది.

బస్సులో టికెట్ల అమ్మకం, చార్జీల వసూలు కోసం ఆర్టీసీ తరఫున ఓ కండక్టర్ విధులు నిర్వహిస్తాడు. డ్రైవర్ సహా బస్సు నిర్వహణ బాధ్యత మొత్తం ఆ బస్సుకు చెందిన కాంట్రాక్టర్ చూసుకుంటారు. ఇందుకోసం టెండర్లు ఆహ్వానించగా.. వెయ్యి బస్సుల సరఫరాకు ముందుకొచ్చిన సంస్థల్లో జేబీఎం గ్రూప్, అశోక్ లేలాండ్ కంపెనీలకు కాంట్రాక్టు దక్కింది. దీనికి సంబంధించి ప్రభుత్వం త్వరలో ఒప్పందం కుదుర్చుకోనుంది. 

ఒప్పందంపై సంతకాలు చేసిన ఏడాదిలోగా వెయ్యి బస్సులను అందజేయాల్సిన బాధ్యత జేబీఎం, అశోక్ లేలాండ్ కంపెనీలదే. ఇలా వచ్చిన వెయ్యి ఎలక్ట్రిక్ బస్సుల్లో 500 బస్సులను హైదరాబాద్ లో మిగతా 500 బస్సులను నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం తదితర నగరాల్లో నడిపించాలని అధికారులు నిర్ణయించారు.


More Telugu News