తృణధాన్యాలనే ఎందుకు తినాలి?

  • వీటితో మనకు మంచే కానీ హాని లేదు
  • గుండె జబ్బుల రిస్క్ 30 శాతం తగ్గుతుంది
  • స్ట్రోక్ రిస్క్, ఇన్ ఫ్లమేషన్ తగ్గడానికి సాయం
  • రక్తంలో గ్లూకోజ్ నియంత్రణలో ఉంటుంది
ఒక్క సంక్షోభం ఎన్నో మార్పులకు దారితీస్తుందంటారు. మనలో ఎక్కువ మంది ఆర్థిక సంక్షోభాలను చూసి ఉంటాం. కానీ, కరోనా రూపంలో మొదటిసారి ఆరోగ్య సంక్షోభాన్ని కూడా చూశాం. కరోనా మహమ్మారి మన దేశంలో సుమారు కోటికి పైగా ప్రజల ప్రాణాలను బలి తీసుకుని ఉంటుందని (ఒక్క శాతం మరణాలు రేటు) అనధికారిక అంచనా. ఎన్నో కుటుంబాలు తమ ఆప్తులను కోల్పోయి విషాదంలో మునిగిపోయాయి. కరోనా తర్వాత ఆరోగ్యంగా జీవించాలని, అన్నింటికంటే ఆరోగ్యం ముఖ్యమనే అవగాహన పెరగడం మంచి పరిణామం. 

తీసుకునే ఆహారం, అలవాట్లతోపాటు నిద్ర మన ఆరోగ్య స్వరూపాన్ని నిర్ణయిస్తాయి. చాలా మంది స్థూలకాయం, మధుమేహం వంటి సమస్యలు వస్తే తప్పించి ఆహారం విషయంలో పెద్దగా నియమాలు పాటించరు. ఇబ్బంది రానంత వరకు నచ్చింది తినడమే ఎక్కువ మంది చేసే పని. కానీ, ముందు నుంచి సరైన ఆహార అలవాట్లను భాగం చేసుకోవడం వల్ల దీర్ఘకాలిక, జీవనశైలి వ్యాధులైన థైరాయిడ్, మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు, కాలేయ వ్యాధుల బారిన పడకుండా చూసుకోవచ్చు.

ఆహారంలో పాలిష్డ్ పట్టిన బియ్యానికి బదులు బ్రౌన్ రైస్, ఇతర తృణ ధాన్యాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. తృణ ధాన్యాల్లో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. దీంతో వీటి వల్ల రక్తంలో గ్లూకోజ్ వెంటనే పెరిగిపోదు. మన శరీరానికి కీలకమైన పోషకాలు నిరంతరాయంగా అందాలంటే రక్తంలో గ్లూకోజ్ నియంత్రిత స్థాయిలో ఉండాలి. బ్లడ్ షుగర్ అధికంగా ఉంటే పోషకాలు తగినంత అందవు. ఇది పోషకాల లేమికి దారితీస్తుంది. మెగ్నీషియం, క్రోమియం, ఫైటోకెమికల్స్, ఆర్గానిక్ యాసిడ్స్, ఎంజైమ్ ఇన్హిబిటర్స్ అన్నవి తృణ ధాన్యాల్లో (ఒరిజనల్ స్వరూపంలో ఉన్న ధాన్యం) ఉంటాయి. వీటికి తోడు పీచు కూడా ఉండడంతో రక్తంలో షుగర్ నియంత్రణలో ఉంటుంది.

తృణ ధాన్యాలను తీసుకోవడం వల్ల గుండె బబ్బుల రిస్క్ 16 నుంచి 30 శాతం వరకు తగ్గుతుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. అలాగే, వీటిల్లోని పీచు, విటమిన్ కే, యాంటీ ఆక్సిడెంట్లు స్ట్రోక్ రిస్క్ ను కూడా తగ్గిస్తాయి. మన శరీరంలో ఇన్ ఫ్లమేషన్ (వాపు) ఎక్కువ కాలం పాటు కొనసాగకూడదు. ఈ ఇన్ ఫ్లమేషన్ పలు అవయవాల పనితీరును దెబ్బతీస్తుంది. ముడి ధాన్యాలు ఇన్ ఫ్లమేషన్ స్థాయిని తగ్గిస్తాయి. 

తృణ ధాన్యాల్లో లిగ్నాన్స్ అని ఉంటాయి. వీటికి ఉండే హార్మోన్ ప్రభావంతో.. హార్మోన్ల సమతుల్యతకు సాయపడతాయి. హార్మోన్ల నియంత్రణకు సాయపడే విటమిన్ బీ6 కూడా తృణ ధాన్యాల్లో ఉంటుంది. వీటివల్ల మహిళల్లో పీరియడ్స్ సమయంలో సమస్యల బాధను తగ్గించుకోవచ్చు. తినగలిగితే సిరిధాన్యాలు అన్నింటికంటే మంచివి. ముఖ్యంగా వీటిల్లో జొన్న, రాగితో చాలా రకాల అనారోగ్యాలను దూరం పెట్టొచ్చు.


More Telugu News