తెలంగాణ సీఎస్ రేసులో ఆ ముగ్గురు!

  • సోమేశ్ కుమార్ బదిలీతో సీఎస్ పోస్టు ఖాళీ
  • ప్రభుత్వం ఎవరిని ఎంపిక చేస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ
  • రేసులో అరవింద్, రామకృష్ణారావు, శాంతికుమారి
తెలంగాణలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) పోస్టు బరిలో ముగ్గురు సీనియర్ అధికారుల పేర్లు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో సీనియర్ ఐఏఎస్ అధికారులు అరవింద్ కుమార్, శాంతికుమారి, వసుధ మిశ్రా.. ఈ ముగ్గురిలో ఒకరు రాష్ట్రానికి కాబోయే సీఎస్ అవుతారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత సీఎస్ సోమేశ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ కు వెళ్లాల్సిందేనని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణలో కొత్త సీఎస్ ఎంపిక అనివార్యంగా మారింది. గతంలో అత్యంత సీనియర్ ఐఏఎస్ అధికారికి సీఎస్ పోస్టు కట్టబెట్టేవారు. 

ప్రస్తుతం ఈ సంప్రదాయాన్ని ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదు. ఈ నేపథ్యంలో కొత్త సీఎస్ గా ప్రభుత్వం ఎవరిని ఎంపిక చేస్తుందనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు, ప్రస్తుతానికి ఇన్ చార్జి సీఎస్ ను నియమించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన అరవింద్ కుమార్ ప్రస్తుతం పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. శాంతికుమారి అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బాధ్యతలు చూసుకుంటున్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ బాధ్యతలను సుదీర్ఘకాలంగా నిర్వహిస్తున్న కె.రామకృష్ణారావు కూడా సీఎస్ బరిలో ఉన్నారు.


రామకృష్ణారావు పనితీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా ఉన్నారని, కొత్త సీఎస్ గా ఆయననే నియమిస్తారని ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఏపీ కేడర్ కు వెళ్లిపోవాల్సిందేనని హైకోర్టు తీర్పునివ్వడంతో, గురువారం (ఈ నెల 12) లోగా ఏపీలో రిపోర్టు చేయాలని కేంద్రం ఆదేశించింది. అయితే, హైకోర్టు ఆదేశాలపై సోమేశ్ కుమార్ ఆలోచనలో పడ్డారని, స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తే ఎలా ఉంటుందని యోచిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది డిసెంబర్ లో సోమేశ్ కుమార్ పదవీకాలం పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో సర్వీసు కూడా పెద్దగా లేకపోవడంతో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునే అవకాశాలే ఎక్కువని తెలుస్తోంది.


More Telugu News