లంక కెప్టెన్ శతకం కోసం.. రోహిత్ అనూహ్య నిర్ణయం

  • తొలి వన్డేలో 67 పరుగుల తేడాతో భారత్ విజయం
  • షమీ బౌలింగులో నాన్ స్ట్రయికింగ్ ఎండ్‌లో ఉన్న షనక అవుట్ 
  • అప్పటికి సెంచరీకి రెండు పరుగుల దూరంలో లంక కెప్టెన్
  • షనక సెంచరీ కోసం అప్పీల్‌ను వెనక్కి తీసుకున్న రోహిత్ శర్మ
  • భారత్ కెప్టెన్ నిర్ణయంపై ప్రశంసల వర్షం
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నిన్న గువాహటిలో శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు అద్వితీయ విజయంతో ఆకట్టుకుంది. 67 పరుగుల తేడాతో విజయం సాధించి శుభారంభం చేసింది. భారత్ నిర్దేశించిన 374 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 306 పరుగులు మాత్రమే చేయగలిగింది. లంక కెప్టెన్ దాసున్ షనక అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. సహచరులు ఒక్కొక్కరే క్రీజును వదులుతున్నా షనక మాత్రం భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టే ప్రయత్నం చేశాడు. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ప్రశంసలు అందుకున్నాడు. 

మొత్తంగా 88 బంతులు ఎదుర్కొన్న షనక 12 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 108 పరుగులు చేసి తన ఖాతాలో మరో సెంచరీ వేసుకున్నాడు. అయితే, ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మహ్మద్ షమీ వేసిన చివరి ఓవర్‌లో షనక అవుటైనా టీమిండియా సారథి రోహిత్ శర్మ పుణ్యమా అని సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివరి ఓవర్ నాలుగో బంతి వేస్తున్న సమయంలో షనక నాన్ స్ట్రయికింగ్ ఎండ్‌లో ఉన్నాడు. అప్పటికి షనక సెంచరీకి రెండు పరుగుల దూరంలో ఉన్నాడు.

షమీ నాలుగో బంతిని సంధించక ముందే షనక క్రీజు వదిలి బయటకు వచ్చాడు. గమనించిన షమీ వికెట్లను గిరాటేసి అప్పీల్ చేశాడు. నిజానికైతే ఇది అవుటే. అయితే, అనుమానం ఉన్న ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని థర్డ్ అంపైర్‌కు వదిలేశాడు. అయితే, అప్పటికి షనక 98 పరుగులతో ఉండడంతో రోహిత్ శర్మ కల్పించుకున్నాడు. షమీతో మాట్లాడి అప్పీల్‌ను వెనక్కి తీసుకున్నాడు. దీంతో లంక కెప్టెన్ బతికిపోయాడు. ఆ బంతికి ఓవర్ త్రో కారణంగా ఐదు పరుగులు వచ్చాయి. స్ట్రయికింగ్‌కు వచ్చిన షనక ఐదో బంతిని బౌండరీకి పంపి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. షనక సెంచరీ కోల్పోకుండా రోహిత్ శర్మ తీసుకున్న ఈ నిర్ణయంపై అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.


More Telugu News