పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ఎన్నికల సంఘం అరెస్ట్ వారెంట్

  • ఎన్నికల కమిషన్‌ పక్షపాతంగా వ్యవహరించిందంటూ ఇమ్రాన్ ఆరోపణలు
  • తీవ్రంగా పరిగణించిన ఈసీపీ
  • విచారణకు హాజరు కావాలని గతేడాది రెండుసార్లు నోటీసులు
  • ఇమ్రాన్ పార్టీ నేతల అభ్యర్థనను తిరస్కరిస్తూ అరెస్ట్ వారెంట్ జారీ
పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ను కష్టాలు చుట్టుముడుతున్నాయి. పదవి నుంచి దిగిపోయిన తర్వాత నుంచి ఆయన ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. తాజాగా, ఆయనకు అరెస్ట్‌ వారెంట్ జారీ అయింది. పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-నవాజ్) పార్టీకి ప్రయోజనం కలిగించేలా ఎన్నికల కమిషన్(ఈసీపీ), చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పక్షపాతంగా వ్యవహరించారంటూ ఇమ్రాన్, ఆ పార్టీ నేతలు పలుమార్లు బహిరంగంగానే ఆరోపించారు.

ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన ఎన్నికల కమిషన్ నిన్న అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఎన్నికల కమిషన్‌పై చేసిన ఆరోపణలపై తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని ఇమ్రాన్‌కు గతేడాది ఆగస్టు, సెప్టెంబరులో నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగిన విచారణలో కమిషన్ ఎదుట హాజరు నుంచి మినహాయింపు కోరుతూ ఆ పార్టీ నేతలు చేసిన విజ్ఞప్తిని ఈసీపీ తిరస్కరిస్తూ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది.


More Telugu News