'ఆర్ఆర్ఆర్' కు ఆస్కార్ అవార్డు ఖాయం అంటున్న హాలీవుడ్ నిర్మాత

  • 301 చిత్రాలతో ఆస్కార్ రిమైండర్ జాబితా
  • భారత్ నుంచి 10 చిత్రాల ఎంపిక
  • అందులో ఆర్ఆర్ఆర్ కు స్థానం
  • ఉత్తమ చిత్రం కేటగిరీలో ఆర్ఆర్ఆర్ విజేత అవుతుందన్న బ్లమ్
ఆస్కార్ అవార్డుల కోలాహలం మరింత ఊపందుకుంది. ఇవాళ 301 చిత్రాలతో ప్రకటించిన ఆస్కార్ రిమైండర్ లిస్టులో భారత్ కు చెందిన 10 సినిమాలు ఉండడం విశేషం. అందులో, టాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో, హాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ జాసన్ బ్లమ్ ట్వీట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆస్కార్ రేసులో ఆర్ఆర్ఆర్ విజేత అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఉత్తమ చిత్రం కేటగిరీలో ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఆస్కార్ ఖాయమని స్పష్టం చేశాడు. 

జాసన్ బ్లమ్ తన బ్లమ్ హౌస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై పారానార్మల్ యాక్టివిటీ, గెట్ అవుట్, హాలోవీన్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించారు. హాలీవుడ్ లో ఉన్న అగ్రగామి చిత్ర నిర్మాణ సంస్థల్లో బ్లమ్ హౌస్ ప్రొడక్షన్స్ ఒకటి. 

తాజాగా ఆస్కార్ కమిటీ రిమైండర్ జాబితా ప్రకటించిన నేపథ్యంలో, జాసన్ బ్లమ్ అంచనాలు చర్చనీయాంశం అయ్యాయి. ఒకవేళ ఆర్ఆర్ఆర్ కు అవార్డు రాకపోతే తానే సొంతంగా అవార్డు ఇస్తానని జాసన్ బ్లమ్ ప్రకటించారు.


More Telugu News