బంగారంపై 16 శాతం రాబడి ఇస్తానంటున్న ఫింటెక్ యాప్ 'గుల్లక్'

  • డిజిటల్ రూపంలో లీజుకు అవకాశం
  • లీజుకు ఇచ్చే బంగారానికి హామీ
  • 0.5 గ్రాముల నుంచి లీజుకు ఇచ్చే వెసులుబాటు
ఫైనాన్షియల్ సేవలు అందించే ఫింటెక్ యాప్ గుల్లక్ ‘గుల్లక్ గోల్డ్ ప్లస్’ అనే పథకాన్ని ప్రకటించింది. బంగారాన్ని ఆభరణాల వర్తకులకు ఇస్తే, ఏకంగా 16 శాతం రాబడి ఇస్తానని ఈ సంస్థ హామీ ఇస్తోంది. బంగారంలో పెట్టుబడులపై చారిత్రకంగా చూస్తే సగటున వార్షిక రాబడి 11 శాతంగా ఉంది. దీనికంటే 5 శాతం అధిక రాబడిని గుల్లక్ ఆఫర్ చేస్తోంది.

5 శాతం అదనపు రాబడిని (వార్షికంగా) 24కే బంగారం రూపంలో, అది కూడా తన నెట్ వర్క్ పరిధిలోని జ్యుయలర్ల నుంచి ఆఫర్ చేస్తోంది. జ్యుయలర్ కు ఇచ్చే బంగారానికి 100 శాతం బ్యాంక్ గ్యారంటీ ఉంటుంది. ‘‘బంగారాన్ని లీజుకు ఇచ్చే విధానం ఆఫ్ లైన్ లో ఉంది. కానీ, ఇది కేవలం 0.01 శాతం జనాభాకే పరిమితమైంది. గుల్లక్ మొదటిసారి డిజిటల్ రూపంలో ఈ సేవలను ఆఫర్ చేస్తోంది. యూజర్లు మరింత సంపాదించేందుకు వీలుగా సురక్షిత మార్గాలను ఆఫర్ చేయాలని అనుకుంటున్నాం’’ అని సంస్థ సహ వ్యవస్థాపకుడు దిలీప్ జైన్ తెలిపారు.

ఇలా లీజుకు తీసుకునే బంగారంతో జ్యుయలర్లు తమ మూలధన అవసరాలను తీర్చుకుంటారు. ధరల అస్థిరతలను అధిగమించే వెసులుబాటు ఏర్పడుతుంది. గుల్లక్ యాప్ ద్వారా బంగారాన్ని లీజుకు తీసుకునే జ్యుయలర్లను అగ్మంట్ ధ్రువీకరిస్తుంది. ప్రతి జ్యుయలర్ తీసుకునే బంగారానికి అగ్మంట్ భద్రతకు హామీ ఇస్తోంది. యూజర్లు అవసరమైతే ఎప్పుడైనా బంగారాన్ని వెనక్కి తీసుకోవచ్చు. కావాలంటే బంగారం లేదంటే నగదును ఇంటి వద్దకే తెచ్చిస్తారు. కనీసం 0.5 గ్రాముల నుంచి బంగారాన్ని లీజుకు ఇచ్చుకోవచ్చు.


More Telugu News