తప్పతాగి ఎయిర్ ఇండియాలో ప్రయాణించొచ్చా?

  • మద్యం సేవించినా విమానం ఎక్కొచ్చు
  • విమానంలోనూ మద్యం సరఫరా
  • వరుసగా మూడు డ్రింక్ లు అందించే ఏర్పాటు
  • బిజినెస్ క్లాస్ అయితే షరతుల్లేవు
టాటా గ్రూపు ఆధ్వర్యంలోని ఎయిర్ ఇండియా విమానాల్లో ఇటీవల తాగుబోతుల అసహ్యకర చేష్టలు గుర్తుండే ఉంటాయి. ఓ ప్రయాణికుడు తాను మూత్రవిసర్జన ఎక్కడ చేస్తున్నదీ కూడా స్పృహ లేనంతగా మద్యం సేవించాడంటే.. తోటి ప్రయాణికుల భద్రతను రిస్క్ లో పెట్టినట్టుగానే భావించాల్సి వస్తుంది. మద్యం ఆలోచించే శక్తిని హరిస్తుంది. మరి ఫూటుగా మద్యం సేవించిన వ్యక్తి విమానంలో బెదిరింపులకు, మరేదైనా దారుణానికి తెగిస్తే ఏంటి పరిస్థితి? అంతగా తాగే వారిని విమానాల్లోకి ఎందుకు అనుమతించడం? ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. జరిగిన దురదృష్టకర ఘటనలకు ఎయిర్ ఇండియా క్షమాపణలు చెప్పింది. 

  • అసలు ఎయిర్ ఇండియా విమానాల్లో ఎంత మేర ఆల్కహాల్ సప్లయ్ చేస్తారు? ఇందుకు సంబంధించి ఎయిర్ ఇండియా విధానాన్ని పరిశీలిస్తే.. 
  • 18 ఏళ్లలోపు వారికి ఆల్కహాల్ సరఫరా చేయరు. 
  • ప్రయాణికులకు వారి సీట్ల వద్దే ఆల్కహాల్ సరఫరా చేస్తారు. అది కూడా ఒక్క విడత ఒక్క డ్రింక్ ను మాత్రమే ఇస్తారు. ఒక డ్రింక్ అంటే స్పిరిట్ అయితే 25-35 ఎంఎల్, బీర్ (5 శాతం ఆల్కహాల్) అయితే 341 ఎంఎల్. 
  • నాలుగు గంటల ప్రయాణం పట్టే మార్గాల్లో గరిష్ఠంగా రెండు డ్రింక్ ల వరకు అందిస్తారు. వరుసగా మూడు డ్రింక్ లు సరఫరా చేసిన తర్వాత, మరో డ్రింక్ కు మధ్య మూడు గంటల విరామం పాటిస్తారు. కాకపోతే ఎయిర్ ఇండియా బిజినెస్ క్లాస్ ప్రయాణికులకు ఈ నిబంధనలు వర్తించవట. 
  • ఎయిర్ పోర్టుల్లోనూ మద్యం సేవించే వసతులు ఉంటాయి. విమానం ఎక్కే సమయానికే కావాల్సినంత పుచ్చుకున్న వారికి, విమానాల్లోనూ సరఫరా చేస్తే అది మోతాదు మించే ప్రమాదం ఉంటుంది. 
  • మొత్తానికి ఇటీవలి ఘటనలు విమానాల్లో మద్యం విధానాన్ని ప్రశ్నించే అవకాశాన్ని కల్పించాయి. 


More Telugu News