మాస్కో-గోవా విమానానికి బాంబు బెదిరింపు.. అత్యవసర ల్యాండింగ్

  • 236 మందితో మాస్కో నుంచి గోవా బయలుదేరిన విమానం
  • విమానంలో బాంబు ఉన్నట్టు గోవా ఏటీసీకి ఫోన్
  • జామ్‌నగర్‌ విమానాశ్రయంలో అత్యవసర లాండింగ్
  • ప్రయాణికులను సురక్షితంగా తరలించిన బాంబ్ స్క్వాడ్
244 మంది ప్రయాణికులతో మాస్కో నుంచి గోవా వెళ్తున్న విమానం బాంబు బెదిరింపు కారణంగా గుజరాత్‌లోని జామ్‌నగర్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండయింది. విమానంలో ప్రయాణికులందరూ విదేశీయులే. వారిని సురక్షితంగా విమానం నుంచి బయటకు తరలించారు. విమానాశ్రయంలో అప్పటికే సిద్ధంగా ఉన్న బాంబ్ డిస్పోజల్ సిబ్బంది విమానాన్ని అధీనంలోకి తీసుకుని తనిఖీలు ప్రారంభించారు. విమానంలో బాంబు ఉన్నట్టు గోవా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)కి సమాచారం అందడంతో దానిని జామ్‌నగర్ విమానాశ్రయానికి మళ్లించి ల్యాండ్ చేశారు. విమానం ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉంది.  

విమానంలోని 236 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బందిని గత రాత్రి 9.49 గంటల సమయంలో సురక్షితంగా ఖాళీ చేయించినట్టు జామ్‌నగర్ ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ తెలిపారు. మాస్కో నుంచి బయలుదేరిన విమానం గోవాలోని డబోలిమ్ విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సి ఉందని గోవా పోలీసులు తెలిపారు. అయితే, బాంబు బెదిరింపు నేపథ్యంలో దానిని జామ్‌నగర్‌కు మళ్లించినట్టు పేర్కొన్నారు.

బాంబు బెదిరింపు ఉత్తదే
కాగా, రాత్రంతా విమానాన్ని తనిఖీ చేసిన నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్‌జీ) అనుమానాస్పద వస్తువేదీ విమానంలో కనిపించలేదని నిర్ధారించింది. ప్రతి ప్రయాణికుడి బ్యాగేజీని తనిఖీ చేసినట్టు జామ్‌నగర్ ఎస్పీ తెలిపారు. బాంబు బెదిరింపు ఉత్తదేనని తేలడంతో విమానం గోవా వెళ్లేందుకు క్లియరెన్స్ లభించింది. ఉదయం 10 గంటలకు విమానం బయలుదేరే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.


More Telugu News