కాపు రామచంద్రారెడ్డి అక్రమాలపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ పాదయాత్రకు సిద్ధమైన టీడీపీ నేత కాలవ శ్రీనివాసులు.. హౌస్ అరెస్ట్

  • ఉద్దేహాళ్ నుంచి తిమ్మలాపురం వరకు పాదయాత్రకు రెడీ అయిన కాలవ శ్రీనివాసులు
  • నోటీసులు ఇచ్చి హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
  • ఇంటి వెనక గోడ దూకి రోడ్డు పైకి వచ్చిన టీడీపీ నేత
  • అక్కడ కూడా అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించి నిరసన
మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులును పోలీసులు నిన్న హౌస్ అరెస్ట్ చేశారు. ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నేతలు ఇసుక, మద్యం, మారణాయుధాల సరఫరా, నకిలీ నోట్లు, జిలెటిన్ స్టిక్స్ వంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపించిన కాలవ శ్రీనివాసులు వారి దందాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని ఉద్దేహాళ్ నుంచి తిమ్మలాపురం వరకు ఆయన ఆధ్వర్యంలో టీడీపీ నేతలు నిన్న పాదయాత్ర చేపట్టారు. 

అయితే, ఈ పాదయాత్రకు అనుమతి లేదంటూ కాలవకు నోటీసులు ఇచ్చి గృహ నిర్బంధం చేశారు. దీంతో ఆయన ఇంటి వెనక గోడ దూకి నేతాజీ రోడ్డుపైకి వెళ్లారు. అక్కడ కూడా ఆయనను పోలీసులు అడ్డుకోవడంతో కార్యకర్తలతో కలిసి ఆయన అక్కడ బైఠాయించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. కాపు రామచంద్రారెడ్డి అక్రమాలను బహిర్గతం చేయకుండా తమపై ఆంక్షలు విధించి నిర్బంధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

పాదయాత్రపై ఈ నెల 6నే బొమ్మనహాళ్ పోలీసులకు సమాచారం ఇచ్చామన్నారు. వైసీపీ నాయకుల ఇసుక అక్రమ దందా కారణంగా పలు గ్రామాల్లో 850 బోర్లు అడుగంటిపోయాయని అన్నారు. కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి, పోలీసుల తీరుకు నిరసనగా టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రోడ్డుపై బైఠాయించిన కాలవను అదుపులోకి తీసుకున్న పోలీసులు తిరిగి ఇంట్లోకి పంపించడంతో పరిస్థితి సద్దుమణిగింది.


More Telugu News