టీ20 ఫార్మాట్ నుంచి తప్పుకోవడంపై ఇంకా ఆలోచించలేదు: రోహిత్ శర్మ

  • శ్రీలంకతో టీ20 సిరీస్ కు రోహిత్ శర్మకు విశ్రాంతి
  • టెస్టులు, వన్డేల్లో కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మ
  • రోహిత్ టీ20ల నుంచి తప్పుకోవచ్చంటూ ప్రచారం
ఇటీవల టీమిండియా ఆటగాళ్లపై పనిభారం పడుతోందంటూ వార్తలు వస్తున్నాయి. స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ ఇప్పటికే టెస్టులు, వన్డేల్లో కెప్టెన్సీ వహిస్తుండగా, టీ20 ఫార్మాట్ నుంచి తప్పుకుంటాడన్న ఊహాగానాలు బయల్దేరాయి. దీనిపై రోహిత్ శర్మ వివరణ ఇచ్చాడు. టీ20 ఫార్మాట్ నుంచి తప్పుకునే ఆలోచనేదీ లేదని స్పష్టం చేశాడు. 

శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్ ఆడిన టీమిండియా నుంచి రోహిత్ శర్మకు, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ లకు విశ్రాంతి కల్పించిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ లో టీమిండియాకు హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా వ్యవహరించగా, 2-1తో సిరీస్ విజయం లభించింది. దాంతో, వచ్చే వరల్డ్ కప్ దిశగా హార్దిక్ పాండ్యా నాయకత్వంలో జట్టును నిర్మించేందుకు బోర్డు ప్రణాళికలు రచించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో రోహిత్ మాట్లాడుతూ, వరుసగా ప్రతి మ్యాచ్ ఆడడం ఆటగాళ్లకు కష్టమేనని వెల్లడించాడు. ఇది అన్ని ఫార్మాట్లకు వర్తిస్తుందని, ఆటగాళ్లకు తగిన విశ్రాంతి అవసరమని పేర్కొన్నాడు. తాను కూడా అందుకు మినహాయింపు కాదని చెప్పాడు. న్యూజిలాండ్ తో 3 టీ20 మ్యాచ్ లు ఆడాల్సి ఉందని, ఐపీఎల్ తర్వాత ఏం జరగనుందో చూడాలి అని రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. ఇప్పటివరకైతే టీ20 ఫార్మాట్ నుంచి తప్పుకోవాలన్న నిర్ణయం తీసుకోలేదని వెల్లడించాడు.


More Telugu News