తండ్రి హత్యకు 31 ఏళ్ల తర్వాత ప్రతీకారం తీర్చుకున్న తనయులు

  • రాజస్థాన్ లో సినిమాను తలపించే ఉదంతం
  • 1992లో హత్యకు గురైన మదన్ సింగ్
  • మదన్ సింగ్ ఓ పత్రికా యజమాని
  • అత్యాచారాలపై కథనాలు రాసిన వైనం
  • హత్య చేసిన దుండగులు
  • తండ్రిని చంపినవాడ్ని హతమార్చిన కుమారులు
రాజస్థాన్ లోని పుష్కర్ లో ప్రతీకార హత్య చోటుచేసుకుంది. తనయులు తమ తండ్రి హత్యకు కారకుడైన వ్యక్తిని 31 ఏళ్ల తర్వాత కాల్చి చంపారు. ఈ కేసు సినిమాకు ఏమాత్రం తీసిపోదు! 

1992 ప్రాంతంలో రాజస్థాన్ లో అజ్మీర్ లో స్కూలు, కాలేజీ విద్యార్థినులను అసభ్య ఫొటోలతో బ్లాక్ మెయిల్ చేసి, వారిపై అత్యాచారాలకు పాల్పడిన ఘటనలు అనేకం జరిగాయి. అప్పట్లో మదన్ సింగ్ అనే వ్యక్తి ఓ వారపత్రిక నడిపేవారు. అజ్మీర్ అరాచకాలపై ఆయన తన వార్తా పత్రికలో కథనాలు రాశారు. దాదాపు 100 మంది అమ్మాయిల జీవితాలను నాశనం చేశారని ఆయన తన కథనాల్లో వివరంగా పేర్కొన్నారు. 

దాంతో ఆయనపై కక్ష గట్టిన కొందరు వ్యక్తులు హత్య చేశారు. మదన్ సింగ్ పై తొలుత శ్రీనగర్ రోడ్ లో దాడి జరగ్గా, ఆయన గాయాలతో జేఎల్ఎన్ ఆసుపత్రిలో చేరారు. అయితే దుండగులు జేఎల్ఎన్ ఆసుపత్రిలోనూ ఆయనపై దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయారు. హత్య కేసు నమోదు చేసిన పోలీసులు సవాయ్ సింగ్, రాజ్ కుమార్ జైపాల్, నరేంద్ర సింగ్ తదితరులను అరెస్ట్ చేశారు.

ఈ హత్య జరిగిన సమయంలో మదన్ సింగ్ కుమారులు ధర్మ, సూర్య చిన్నవాళ్లు. ధర్మ వయసు 12 ఏళ్లు, సూర్య వయసు 8 ఏళ్లు. అప్పట్లో ఈ కేసులో యూత్ కాంగ్రెస్ నేతల పేర్లు వినపడడంతో అంతర్జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత పొందింది. ఇక, ధర్మ, సూర్య పెరిగి పెద్దవాళ్లయ్యారు. 2012లో ఈ కేసులో నిందితులైన సవాయ్ సింగ్, రాజ్ కుమార్ జైపాల్ లను కోర్టు నిర్దోషులుగా పేర్కొంది. 

ఇక ధర్మ, సూర్యల పగ వారి వయసుతో పాటే పెరుగుతూ వచ్చింది. అదను చూసి సవాయ్ సింగ్ ను అంతమొందించారు. తన కుమారుడి పెళ్లి ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు ఓ రిసార్ట్ కు వచ్చిన సవాయ్ సింగ్ (70)పై సూర్య, ధర్మ కాల్పులు జరిపారు. బుల్లెట్ గాయాలతో సవాయ్ సింగ్, దినేశ్ తివారీ అనే మరో వ్యక్తి ప్రాణాలు విడిచారు. 

అయితే ఈ ఘటనలో సూర్యను పోలీసులు అరెస్ట్ చేయగా, ధర్మ తప్పించుకున్నాడు. సూర్య నుంచి పోలీసులు ఓ దేశవాళీ పిస్టల్, మూడు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా, సూర్య, ధర్మ కూడా మామూలు వ్యక్తులేం కాదని, వాళ్లిద్దరిపై అనేక కేసులు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. దోపిడీ, బెదిరింపులు, ల్యాండ్ మాఫియా వ్యవహారాల్లో వీరు నిందితులని తెలిపారు.


More Telugu News