మారనున్న ట్విట్టర్ రూపు.. ఫిబ్రవరి నుంచి పెద్ద మెస్సేజ్ లు

  • యూజర్ ఇంటర్ ఫేస్ లో మార్పులు
  • ఈ వారం చివరి నుంచే అమల్లోకి
  • మరింత మెరుగైన యూజర్ అనుభవం కోసమేనన్న మస్క్
  • ఫిబ్రవరి మొదటి నుంచి పెద్ద సైజు ట్వీట్లకు అవకాశం
ట్విట్టర్ సంస్కరణను ఎలాన్ మస్క్ ఇంకా పూర్తి చేయలేదు. కొత్త కొత్త ప్రయోగాలను కొనసాగిస్తూనే ఉన్నాడు. త్వరలో ట్విట్టర్ ఇప్పటి మాదిరిగా కనిపించకపోవచ్చు. ఎందుకంటే ట్విట్టర్ యూజర్ ఇంటర్ ఫేస్ (యూఐ) మారబోతోంది. అంతేకాదు, పెద్ద సైజ్ మెస్సేజ్ లతో ట్వీట్ చేసుకునే సదుపాయం ఫిబ్రవరి నుంచి అందుబాటులోకి రానుంది. మరింత మెరుగైన యూజర్ అనుభవాన్ని కల్పించేందుకు వీలుగా కొత్త రూపాన్ని ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

యూజర్ ఇంటర్ ఫేస్ లో మార్పులు ఈ వారం చివరి నుంచి అమల్లోకి రానున్నాయి. బుక్ మార్క్ ఫీచర్ ను కూడా మెరుగు పరచనున్నారు. ఏదైనా ట్వీట్ ను తర్వాత మళ్లీ చూడాలనుకుంటే దాన్ని బుక్ మార్క్ చేసుకోవచ్చు. ఈ బుక్ మార్క్ మెస్సేజ్ ల కోసం ప్రత్యేక ట్యాబ్ ఉంటుంది. ఇక ట్విట్టర్ లో ప్రస్తుతం ఒక ట్వీట్ లో గరిష్ఠంగా 280 క్యారెక్టర్లు ఉండొచ్చు. ఫిబ్రవరి నుంచి మరిన్ని క్యారెక్టర్లకు మస్క్ అవకాశం కల్పించనున్నారు. 4,000 క్యారక్టర్ల వరకు అనుమతించొచ్చన్న అంచనాలు ఉన్నాయి. కానీ ట్విట్టర్ నుంచి లేదా మస్క్ నుంచి దీనిపై స్పష్టత లేదు.


More Telugu News