కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు ఎంచుకోవడానికి కారణం ఇదే: రాహుల్ గాంధీ

  • రాహుల్ భారత్ జోడో యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన 
  • ఆయన వెంట నడుస్తున్న వివిధ వర్గాల ప్రముఖులు
  • ప్రజలు తనను దేవుడిలా చూడాలని మోదీ కోరుకుంటున్నారని వ్యాఖ్య
  • ప్రజలకు పార్టీ అభయం ఇచ్చేదిగా ఉండాలనే హస్తం గుర్తును ఎంచుకున్నట్టు చెప్పిన రాహుల్
  • తనది రాజకీయ పోరాటం కాదన్న కాంగ్రెస్ నేత
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు యాత్రలో పాల్గొని ఆయన వెంట నడుస్తున్నారు. యాత్రలో భాగంగా నిన్న హర్యానా కురుక్షేత్రలోని బ్రహ్మ సరోవరంలో రాహుల్ హారతి సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో నెలకొన్న విద్వేషాలను, భయాలను తొలగించేందుకు కాంగ్రెస్ తపస్సు చేస్తోందన్నారు. ప్రజలు తనను దేవుడిలా ఆరాధించాలని ప్రధాని నరేంద్రమోదీ కోరుకుంటున్నారని, అందుకనే ఆయన వివిధ వర్గాల ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీజేపీ, ఆరెస్సెస్‌లాగా కాంగ్రెస్ వ్యక్తిపూజ కోరుకోవడం లేదని రాహుల్ స్పష్టం చేశారు. జోడోయాత్రలో లక్షలాదిమంది ప్రజలు తనతో కలిసి నడిచేందుకు కారణం అదేనన్నారు. యాత్ర విజయవంతం కావడానికి అదే ప్రధాన కారణమన్న రాహుల్.. కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేవుళ్ల చేతిని చూస్తే అభయముద్ర కనిపిస్తుందని, ప్రజలు దానిని దేవుళ్లు తమకు ఇచ్చే ఆశీర్వాదంగా భావిస్తారని అన్నారు. కానీ అది భగవంతుడు భక్తులకు ఇచ్చే అభయమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అభయం ఇచ్చేదిగా ఉంటుందనే పార్టీ హస్తం గుర్తును ఎంచుకున్నట్టు రాహుల్ వివరించారు.

తాను చేస్తున్నది పైకి రాజకీయ పోరాటంగా కనిపించినప్పటికీ అంతర్గతంగా ఆ పోరాటం ఉద్దేశం వేరని అన్నారు. ఇతర రాజకీయ పార్టీలతో తాము పోరాడితే అది రాజకీయ పోరాటం అవుతుందని, కానీ ఆరెస్సెస్ విద్యావ్యవస్థలను ప్రభావితం చేయడం ప్రారంభించినప్పటి నుంచి ధర్మం, సిద్ధాంతం కోసం చేస్తున్న పోరాటంగా మారిపోయిందని రాహుల్ అన్నారు. ఈ యాత్ర ముగిసిన తర్వాత కూడా పార్టీ మరిన్ని కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు. దేశంలో సంపద, మీడియా, ఇతర వ్యవస్థలు కొంతమంది వ్యక్తుల నియంత్రణలోకి వెళ్లాయని రాహుల్ అన్నారు.


More Telugu News