నా అభిమానికదా అని బాబీకి ఛాన్స్ ఇవ్వలేదు: చిరంజీవి

  • విశాఖలో జరిగిన 'వాల్తేరు వీరయ్య' ప్రీ రిలీజ్ ఈవెంట్
  • కథ వినగానే ఓకే చెప్పానన్న చిరూ 
  • రెండేళ్లుగా బాబీ కష్టం చూశానని వివరణ
  • అందరికీ ఈ సినిమా నచ్చుతుందని వ్యాఖ్య 
  • విశాఖలో ఇల్లు కట్టుకుంటానని వెల్లడి  
చిరంజీవి కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో చేసిన 'వాల్తేరు వీరయ్య' సినిమా, విశాఖలో ప్రీ రిలీజ్ ఈవెంటును జరుపుకుంది. ఈ వేదికపై చిరంజీవి మాట్లాడుతూ .. "బాబీ నా దగ్గరికి వచ్చి ఫస్టు సిటింగులో కథ వినిపించినప్పుడు .. ఈ సినిమా మనం చేస్తున్నాము అని చెప్పాను. ఫస్టు టైమ్ వినగానే నాకు నచ్చిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఆ నమ్మకంతో చెబుతున్నాను .. ఈ సినిమా తప్పకుండా ఆడుతుంది" అన్నారు. 

"ఈ సినిమా చేస్తున్నప్పుడు రోజు రోజుకి బాబీపై ప్రేమ పెరుగుతూ పోయింది. అందుకు కారణం ఆయన కష్టపడిన తీరు. ఈ సినిమాను నేను చూశాను .. ప్రతి ఒక్కరినీ అలరిస్తుంది. బాబీ దర్శకుడు మాత్రమే కాదు, మంచి రచయిత .. స్క్రీన్ ప్లే రైటర్ కూడా. అభిమాని కదా అని నేను సినిమా ఇవ్వలేదు .. ఆయన టాలెంట్ నచ్చి ఈ సినిమాను ఇచ్చాను" అని చెప్పారు. 

"ఒక కమర్షియల్ సినిమాకి ఉండవలసిన  లక్షణాలన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. ఈ సినిమా విషయంలో బాబీ నిరంతరం కసరత్తు చేస్తూనే వచ్చాడు. ఎవరైతే వర్క్ ను ప్రేమిస్తారో .. ఎవరైతే కష్టాన్ని నమ్ముకుంటారో అలాంటివారు నాకు అభిమానులు. రెండేళ్లుగా బాబీ కష్టాన్ని చూస్తూ వచ్చిన నేను ఆయనకి అభిమానినయ్యాను" అంటూ ప్రశంసించారు. చిరంజీవి ఆ మాట అనగానే బాబీ ఆయన పాదాలపై పడిపోయాడు. ఇక త్వరలో తాను విశాఖలో ఇల్లు కట్టుకుంటానని చిరంజీవి ఈ వేదిక ద్వారా చెప్పడం మరో ఆసక్తికరమైన అంశం.


More Telugu News