బాక్సర్ నిఖత్ జరీన్ కు రూ.5 లక్షల నజరానా అందించిన రేవంత్ రెడ్డి

  • ఇటీవల జాతీయ స్థాయిలో స్వర్ణం సాధించిన నిఖత్ జరీన్
  • 2021 ఒలింపిక్స్ లో ఆడలేకపోయిన జరీన్
  • 2022లో నాలుగు స్వర్ణాలతో సత్తా చాటిన వైనం
  • హైదరాబాద్ నిజాం క్లబ్ లో అభినందన సభ
తెలంగాణ ఆణిముత్యం, మహిళా బాక్సర్ నిఖత్ జరీన్ ఇటీవల జాతీయ బాక్సింగ్ స్వర్ణం సాధించడం తెలిసిందే. 2021 ఒలింపిక్స్ లో పాల్గొనలేకపోయిన నిఖత్ జరీన్ ఆ తర్వాత జూలు విదిల్చింది. 2022లో నాలుగు స్వర్ణాలతో సత్తా చాటింది. వాటిలో కామన్వెల్త్ క్రీడల పసిడి పతకం కూడా ఉండడం విశేషం. అంతేకాదు, వరల్డ్ బాక్సింగ్ చాంపియన్ షిప్ లోనూ విజేతగా నిలిచింది. ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డు కూడా ఆమెను వరించింది.

ఈ నేపథ్యంలో, హైదరాబాద్ నిజాం క్లబ్ లో నిఖత్ జరీన్ కు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు. నిఖత్ జరీన్ కు తెలంగాణ కాంగ్రెస్ తరఫున రూ.5 లక్షల నజరానా అందించారు. 

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించే విషయంలో ఉదాసీన వైఖరి వీడాలని అన్నారు. నిఖత్ జరీన్ కు పోలీసు శాఖలో డీఎస్పీ ర్యాంకుతో ఉద్యోగం ఇచ్చేందుకు ప్రభుత్వం వద్ద ప్రతిపాదనలు ఉన్నాయని, రిపబ్లిక్ డే (జనవరి 26) లోపు ఆమెకు నియామక ఉత్తర్వులు ఇవ్వాలని తెలిపారు. అంతేకాదు, స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు కోసం నిఖత్ జరీన్ కు ప్రభుత్వం స్థలం కేటాయించాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 

కాగా, ఈ అభినందన సభలో తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజహరుద్దీన్, కాంగ్రెస్ సీనియర్ నేతలు షబ్బీర్ అలీ, మధుయాష్కీగౌడ్, మహేశ్ కుమార్ గౌడ్ కూడా హాజరయ్యారు.


More Telugu News