ఆ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా సూర్యకుమార్ యాదవ్

  • శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో చెలరేగిన సూర్య
  • 45 బంతుల్లోనే సెంచరీ
  • అత్యంత వేగంగా శతకం బాదిన రెండో భారత బ్యాటర్‌
  • ఓపెనర్‌గా కాకుండా మధ్యలో వచ్చి మూడు సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్‌గా సూర్య రికార్డ్
మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో గత రాత్రి రాజ్‌కోట్‌లో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అరుదైన రికార్డును తన పేర రాసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో చిచ్చరపిడుగల్లే చెలరేగిపోయిన సూర్య.. బ్యాట్‌తో పరుగుల సునామీ సృష్టించాడు. 45 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. టీ20ల్లో అతడికిది మూడో సెంచరీ. ఈ శతకంతో అతడి పేరుపై ఓ రికార్డు నమోదైంది. టీ20ల్లో అత్యంత వేగంగా సెంచరీ సాధించిన రెండో ఇండియన్ బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ అతడి కంటే ముందున్నాడు. 

2017లో ఇండోర్‌లో శ్రీలంకతోనే జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ 35 బంతుల్లోనే శతకం నమోదు చేశాడు. సూర్య తర్వాత కేఎల్ రాహుల్ (46) మూడో స్థానంలో ఉండగా, ఆ తర్వాత రెండు స్థానాల్లోనూ సూర్యకుమార్ యాదవ్ ఉండడం గమనార్హం. గతేడాది నాటింగ్‌హామ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 48 బంతుల్లో, మౌంట్‌మాంగనూయిలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 49 బంతుల్లో సూర్యకుమార్ సెంచరీలు బాదాడు. అంతేకాదు, ఓపెనర్‌గా కాకుండా మధ్యలో బ్యాటింగ్‌కు దిగి మూడు సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్‌గానూ సూర్యకుమార్ చరిత్ర సృష్టించాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా సూర్యకుమార్ సుడిగాలి ఇన్నింగ్స్‌తో ఐదు వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. అనంతరం 229 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక 137 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా 91 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన భారత్ సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది.


More Telugu News