చికెన్‌ను వంటగదిలో ట్యాప్ వాటర్ కింద కడుగుతున్నారా? జాగ్రత్త!

  • చికెన్‌ను నీటిధార కింద కడగడం వల్ల అందులోని బ్యాక్టీరియా వంటగది అంతా వ్యాపిస్తుందంటున్న నిపుణులు
  • వెనిగర్, నిమ్మరసంతో శుభ్రం చేయడం వల్ల కూడా ఫలితం ఉండదని స్పష్టీకరణ
  • ఆస్ట్రేలియా ఫుడ్ సేప్టీ ఇన్పర్మేషన్ కౌన్సిల్ సర్వేలో వెల్లడి
మార్కెట్ నుంచి చికెన్ తెచ్చి వండే ముందు వంటగదిలోని ట్యాప్ కింద పెట్టి శుభ్రంగా కడిగేస్తున్నారా? అయితే ఇది మీకోసమే. చికెన్‌ను అలా కడగడం వల్ల ప్రమాదకరమైన కాంపైలోబాక్టర్, సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా వంటగది అంతా వ్యాపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా వ్యాపించే బ్యాక్టీరియా పలు వ్యాధులకు కారణమవుతుందని పేర్కొన్నారు. ఆస్ట్రేలియా ఫుడ్ సేఫ్టీ ఇన్ఫర్మేషన్ కౌన్సిల్ జరిపిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఇక్కడి జనాభాలో సగం మందికిపైగా ఇలా చికెన్‌ను వంటగదిలోని ట్యాప్ కింద కడుగుతున్నారు. ఫలితంగా ఆస్ట్రేలియాలో గత 20 ఏళ్లలో కాంపైలోబాక్టర్, సాల్మొనెల్లా ఇన్ఫెక్షన్లు రెట్టింపు అయినట్టు తెలిపారు.

అత్యాధునిక మార్గాల్లో మాంసం ఉత్పత్తి అవుతున్న ఈ రోజుల్లో చికెన్‌ను కడాగాల్సిన అవసరం లేదని, తప్పకుండా కడుక్కోవాలనిపిస్తే కనుక పాత్రలో నీళ్లు పోసి అందులో చికెన్‌ను ముంచి కడుక్కోవచ్చని సూచిస్తున్నారు. కొందరు వెనిగర్, నిమ్మరసంతో చికెన్‌ను శుభ్రం చేస్తుంటారని, దీనివల్ల కూడా ఎలాంటి ఉపయోగం ఉండదని, ఇలా చేసినా బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుందని వివరించారు. కాబట్టి ఇకపై చికెన్‌ను శుభ్రం చేసేముందు జరభద్రం!


More Telugu News